ప్రేక్షకులు నా ఆటను చూడరు.. వాటినే చూస్తారు: సెక్సిజంపై గ్రాండ్‌మాస్టర్ దివ్య కామెంట్స్
నెదర్లాండ్స్‌లోని విజ్క్ ఆన్ జీలో జరిగిన టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్‌లో పాల్గొన్న తర్వాత భారత చెస్ స్టార్ దివ్య దేశ్‌ముఖ్ క్రీడల్లో సెక్సిజం, స్త్రీ ద్వేషం సమస్యపై సంచలన కామెంట్స్ చేశారు. మహిళా ఆటగాళ్లను ప్రేక్షకులు చూసే విధానంపై తన సోషల్ మీడియా పోస్ట్‌లో రాసుకొచ్చారు. టాటా స్టీల్ టోర్నీలో ప్రేక్షకులు తన ఆటపై కాకుండా, తన జుట్టు, బట్టలు, ఉచ్చారణ వంటి అనవసరమైన విషయాలపై దృష్టి సారించినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రేక్షకుల నుంచి తాను లైంగిక వేధింపులను ఎదుర్కొన్నానని దివ్య దేశ్‌ముఖ్ ఆరోపించారు. నాగ్‌పూర్‌కు చెందిన 18 ఏళ్ల దివ్య ఇంటర్నేషనల్ టోర్నీలో తనకు ఎదురైన చేదు అనుభవాలను సోషల్ మీడియాలో సుదీర్ఘ పోస్ట్ ద్వారా తెలియజేశారు.
మహిళా క్రీడాకారులను తేలిగ్గా తీసుకుంటున్నారు: దివ్య
సెక్సిజం, వేదింపులపై తాను చాలా కాలంగా మాట్లాడాలని అనుకుంటున్నట్లు దివ్య దేశ్‌ముఖ్ పేర్కొన్నారు. కానీ టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్ ముగిసే వరకు వేచి ఉండి.. ఈ పోస్టు పెట్టినట్లు చెప్పారు. చెస్‌లో మహిళా క్రీడాకారులను ప్రేక్షకులు చాలా తేలిగ్గా తీసుకోవడం తాను గమనించినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల తాను స్వయంగా దీనిని అనుభవించానన్నారు. ఈ టోర్నీలో తాను గర్వించదగ్గ కొన్ని మ్యాచ్‌లు ఆడానని వివరించారు. కానీ ఆ సమయంలో ప్రేక్షకుల దృష్టి తన ఆటపైనే కాకుండా బట్టలు, జుట్టు, మాట, ఇతర అంశాలపై ఉన్నట్లు వెల్లడించారు. పురుషులు ఈ గేమ్‌లో ప్రసిద్ధి చెందారని, కానీ మహిళల విషయంలో అందుకు విరుద్ధంగా ఉందన్నారు.