ఇండియన్ ఫుట్‌బాల్ లెజెండ్ హబీబ్ కన్నుమూత.. పదేళ్లు భారత తరుపున ఆడి రికార్డు!
భారత మాజీ ఫుట్ బాల్ మాజీ ఆటగాడు మహ్మద్ హబీబ్ కన్నుమూశాడు. 70వ శతకంలో అత్యత్తుమ ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ హైదరాబాదీ ఆటగాడు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలున్నారు. 1949 జులై 17న హైదరాబాద్‌లో హబీబ్ జన్మించారు. 1970లో బ్యాంకాక్ ఆసియా క్రీడల్లో కాంస్యం గెలిచిన భారత జట్టులో హబీబ్ కీలక సభ్యుడు. హబీబ్ కెరీర్ మొత్తం కోల్‌కతాలోనే గడిచింది. 1966 నుంచి 1984 వరకు అక్కడే ప్రధాన ఆటగాడిగా కొనసాగాడు. ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా కోచ్‌గా పనిచేశాడు.
అర్జున పురస్కారంతో హబీబ్ ను గౌరవించిన కేంద్రప్రభుత్వం
పదేళ్ల పాటు (1965-75) భారత జట్టు తరఫున ఆడిన హబీబ్‌ను కేంద్ర ప్రభుత్వం 1980లో 'అర్జున' పురస్కారంతో సత్కరించింది. 1977లో మోహన్ బగాన్ కోసం కాస్మోస్ క్లబ్‌కు ప్రత్యర్థిగా హబీబ్ బరిలోకి దిగారు. ఈ ఫ్రెండ్లీ మ్యాచ్ లో లెజెండరీ పీలే కూడా పాల్గొనడం హబీబ్ కెరీర్‌లో గుర్తిండిపోయే ఘటన అని చెప్పొచ్చు. ప్రతిష్టాత్మక డ్యురాండ్ కప్ మూడు వేర్వేరు ఫైనల్ మ్యాచ్‌లలోనూ గోల్ చేసిన ఏకైక ఆటగాడిగా ఇప్పటికీ ఆ రికార్డు హబీబ్ పేరు మీదే ఉండడం విశేషం. జాతీయ ఫుట్‌బాల్ టోర్నీ 'సంతోష్ ట్రోఫీ'ని ఏకైక సారి ఆంధ్రప్రదేశ్ జట్టు 1966లో కైవసం చేసుకుంది. హబీబ్ మరణం పట్ల పలువురు క్రీడాకారులు సంతాపం వ్యక్తం చేశారు.