ఆసియా ఛాంపియన్‌గా భారత కబడ్డీ జట్టు.. 8వసారి టైటిల్ కైవసం
కబడ్డీ ఆటలో తమకు తిరుగులేదని భారత పురుషుల జట్టు మరోసారి నిరూపించింది. నేడు జరిగిన ఆసియన్ కబడ్డీ ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్లో భారత్ 42-32 తేడాతో ఇరాన్‌పై ఘన విజయం సాధించింది. దక్షిణా కొరియాలోని బుసాన్ వేదికగా ఈ టోర్నీ జరిగింది. ఫైనల్లో పది పాయింట్ల తేడాతో ఇరాన్ ను చిత్తు చేసి భారత్ టైటిల్ ను సాధించింది. దీంతో 8వ సారి ఆసియన్ కబడ్డీ ఛాంపియన్ షిప్ టైటిల్ ను భారత్ సొంతం చేసుకొని రికార్డు సృష్టించింది. ముఖ్యంగా ఈ మ్యాచులో టీమిండియా కెప్టెన్ షెహ్రావత్ 10 పాయింట్లు సాధించి సత్తాచాటాడు. ఇప్పటివరకూ ఈ టోర్నీ తొమ్మిదిసార్లు జరగ్గా, ఎనిమిదిసార్లు టీమిండియానే ఛాంపియన్ గా నిలవడం విశేషం.
ఆసియా గేమ్స్ పై దృష్టి సారించనున్న భారత కబడ్డీ జట్టు
అంతకుముందు జరిగిన చివరి లీగ్ మ్యాచులో భారత్ 64-20తో హాంకాంగ్‌ను ఓడించిన విషయం తెలిసిందే. దాంతో టోర్నీ లీగ్ దశను అజేయంగా ముగించింది. ఈ మెగా టోర్నీలో భారత్, ఇరాన్, జపాన్, కొరియా, చైనీస్ తైపీ, హాంకాంగ్ జట్లు పోటీ పడ్డాయి. లీగ్ దశలో ఆడిన ఐదు మ్యాచుల్లోనూ భారత్ గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఇక భారత కబడ్డీ జట్టుకు తర్వాత ఆసియా గేమ్స్ కీలకంగా మారనున్నాయి. సెప్టెంబర్ 23 నుంచి చైనాలోని హాంగ్ జపూ వేదికగా ఆసియా గేమ్స్ స్పోర్ట్స్ ఈవెంట్ జరగనుంది. 2018 ఆసియా క్రీడల్లో భారత్ సెమీఫైనల్లోనే ఓడిన విషయం తెలిసిందే. ఈ సారి స్వర్ణం గెలవాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది.