LOADING...
INDW vs SAW: నాడిన్ డి క్లెర్క్ మెరుపు ఇన్నింగ్స్‌.. మహిళల ప్రపంచకప్‌లో భారత్ తొలి ఓటమి.. 
నాడిన్ డి క్లెర్క్ మెరుపు ఇన్నింగ్స్‌..మహిళల ప్రపంచకప్‌లో భారత్ తొలి ఓటమి..

INDW vs SAW: నాడిన్ డి క్లెర్క్ మెరుపు ఇన్నింగ్స్‌.. మహిళల ప్రపంచకప్‌లో భారత్ తొలి ఓటమి.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 10, 2025
08:44 am

ఈ వార్తాకథనం ఏంటి

మహిళల ప్రపంచకప్‌లో భాగంగా గురువారం విశాఖపట్టణం ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత పోరులో భారత మహిళల జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. దక్షిణాఫ్రికా జట్టు మూడు వికెట్ల తేడాతో భారత్‌పై అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ నాడిన్ డి క్లెర్క్(Nadine de Klerk)ఆడిన మెరుపు ఇన్నింగ్స్ ఆ జట్టుకు విజయాన్ని అందించడంలో కీలకపాత్ర పోషించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత జట్టు 49.5 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌటైంది. ఒక దశలో 102 పరుగులకే ఆరుగురు బ్యాటర్లు పెవిలియన్ చేరడంతో భారత్ తీవ్ర ఒత్తిడిలో పడింది. ఓపెనర్లు స్మృతి మంధాన (23) ప్రతీక రావల్ (37) కొంతమేర శుభారంభం అందించినప్పటికీ, మిడిలార్డర్ పూర్తిగా విఫలమైంది.

వివరాలు 

 రిచా ఘోష్ అద్భుత బ్యాటింగ్  

కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (9) మరోసారి నిరాశపరిచింది. జెమీమా రోడ్రిగ్స్ (0) డకౌట్ అయ్యింది. ఈ క్లిష్ట సమయంలో రిచా ఘోష్ (Richa Ghosh) మాత్రం అద్భుత ప్రతిభ కనబరిచింది. 77 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో 94 పరుగులతో అసాధారణ పోరాటం చేసి జట్టును ఆదుకుంది. త్రుటిలో సెంచరీ మిస్ అయినా, ఆమె దూకుడైన బ్యాటింగ్ భారత్‌ను గౌరవప్రద స్థాయికి చేర్చింది. రిచా ఘోష్, అమన్‌జోత్ కౌర్ కలిసి ఏడో వికెట్‌కు 51 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు. తర్వాత స్నేహ్ రాణా (Sneh Rana)తో కలిసి ఎనిమిదో వికెట్‌కు కేవలం 53 బంతుల్లోనే 88 పరుగులు జోడించారు.

వివరాలు 

 ఆరంభంలో తడబడిన దక్షిణాఫ్రికా

దాంతో భారత స్కోరు 241పరుగులకు చేరింది.మహిళల ప్రపంచకప్ చరిత్రలో 8వ స్థానంలో లేదా దాని కంటే దిగువ స్థానంలో బ్యాటింగ్ చేసిన వారిలో అత్యధిక వ్యక్తిగత స్కోరు (94)సాధించిన ఆటగాళ్ల జాబితాలో రిచా ఘోష్ కొత్త రికార్డు సృష్టించింది. చివరి 10 ఓవర్లలో భారత్ 98 పరుగులు సాధించడం విశేషం.దక్షిణాఫ్రికా బౌలర్లలో క్లో ట్రయాన్(Chloe Tryon) 3 వికెట్లు, మరిజానే కాప్(Marizanne Kapp)నాడిన్ డి క్లెర్క్ చెరో 2 వికెట్లు తీశారు. 252 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా కూడా ఆరంభంలో తడబడింది. 81 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పరాజయం అంచునకు చేరింది. ఆ సమయంలో కెప్టెన్ లారా వోల్వర్డ్ట్ (Laura Wolvaardt)ఒక ఎండ్‌లో నిలబడి అద్భుత ఇన్నింగ్స్ ఆడింది.

వివరాలు 

నాడిన్ డి క్లెర్క్ మెరుపు బ్యాటింగ్

ఆమె 111 బంతుల్లో 70 పరుగులు (8 ఫోర్లు) చేయగా, క్లో ట్రయాన్ (49)తో కలిసి ఆరో వికెట్‌కు 61 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది అయితే 142 పరుగుల వద్ద వోల్వర్డ్ట్ ఔటవడంతో దక్షిణాఫ్రికా మళ్లీ కష్టాల్లో పడింది. ఇలాంటి పరిస్థితిలో క్రీజులోకి వచ్చిన నాడిన్ డి క్లెర్క్ (Nadine de Klerk) భారత బౌలర్లపై విరుచుకుపడి (54 బంతుల్లో 84 నాటౌట్) మెరుపు బ్యాటింగ్‌తో అద్భుత బ్యాటింగ్ భారత బౌలర్లపై విరుచుకుపడింది. ఆమె ఆఖరి వరకు పోరాడి,జట్టును 48.5 ఓవర్లలో 7 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయ లక్ష్యాన్ని చేరేలా చేసింది.

వివరాలు 

బెలిండా క్లార్క్ రికార్డును అధిగమించిన మంధాన

డి క్లెర్క్, క్లో ట్రయాన్ ఏడో వికెట్‌కు 69 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. చివర్లో నాడిన్ డి క్లెర్క్, ఆయాబొంగ ఖాకాతో కలిసి 8వ వికెట్‌కు అవసరమైన పరుగులు సులభంగా రాబట్టింది. అద్భుత ఆల్‌రౌండ్ ప్రదర్శనకు గాను నాడిన్ డి క్లెర్క్‌కు "ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్" అవార్డు దక్కింది. భారత బౌలర్లలో క్రాంతి గౌడ్ (Kranti Gaud), స్నేహ్ రాణా చెరో రెండు వికెట్లు తీశారు. ఈ మ్యాచ్‌లో స్మృతి మంధాన 23 పరుగులు చేసింది. దీంతో 2025 సంవత్సరంలో వన్డే ఫార్మాట్‌లో ఆమె మొత్తం పరుగులు 982కి చేరాయి. ఈ ఫలితంగా ఒకే క్యాలెండర్ సంవత్సరంలో అత్యధిక వన్డే పరుగులు చేసిన బ్యాటర్‌గా బెలిండా క్లార్క్ రికార్డును మంధాన అధిగమించింది.