IPL 2023: మహమ్మద్ షమీ నుంచి రోహిత్‌కు గండం
2023 ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్వాలిఫైయర్ 2 మ్యాచులో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మే 26న ఈ మ్యాచ్ జరగనుంది. ఇందులో గెలిచిన జట్టు ఫైనల్లో చైన్నై సూపర్ కింగ్స్‌తో పోటీ పడనుంది. ఈ సీజన్‌లో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మను గుజరాత్ బౌలర్ మహ్మద్ షమీ రెండు సార్లు ఔట్ చేశాడు. పవర్ ప్లేలో షమీ బౌలింగ్‌ని రోహిత్ ఎలా ఎదుర్కోంటాడో వేచి చూడాల్సిందే. ఈ సీజన్లో షమీ వేసిన ఆరు బంతుల్లో రోహిత్ 8 పరుగులు మాత్రమే రాబట్టాడు. ఈ సీజన్ ఆరంభంలో ముంబై కాస్త తడబడినా సెకండాఫ్ లో మెరుగ్గా రాణించి ఫ్లే ఆఫ్స్ కు అర్హత సాధించింది.
పర్పుల్ క్యాప్ లీడ్ లో మహ్మద్ షమీ
రోహిత్ ఈ సీజన్లో బ్యాటింగ్‌లో పూర్తిగా నిరాశపరిచాడు. అతను 15 మ్యాచుల్లో 133.33 స్ట్రైక్ రేట్‌తో ఇప్పటివరకు కేవలం 324 పరుగులు సాధించాడు. ముఖ్యంగా షమీ పవర్ ప్లేలో ప్రత్యర్థుల వికెట్లు తీయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సీజన్లో కేవలం పవర్ ప్లేలోనే 15 వికెట్లు తీశాడు. ఇంతవరకూ ఈ రికార్డు ఏ బౌలర్ కు సాధ్యం కాలేదు. 15 మ్యాచుల్లో 26 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ లీడులో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. రోహిత్ ముంబై తరుపున 5వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచాడు. అతను ఇప్పటివరకూ 242 ఐపీఎల్ మ్యాచులు ఆడి 6203 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 42 హాఫ్ సెంచరీలున్నాయి.