Page Loader
IPL 2025 Points Table: ఐపీఎల్ 2025 పాయింట్ల పట్టిక.. టాప్-3లో ఒక్కసారి కూడా టైటిల్ గెలవని జట్లు!
ఐపీఎల్ 2025 పాయింట్ల పట్టిక.. టాప్-3లో ఒక్కసారి కూడా టైటిల్ గెలవని జట్లు!

IPL 2025 Points Table: ఐపీఎల్ 2025 పాయింట్ల పట్టిక.. టాప్-3లో ఒక్కసారి కూడా టైటిల్ గెలవని జట్లు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 02, 2025
01:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2025 ఆసక్తికరంగా కొనసాగుతోంది. ప్రధాన ఫేవరెట్లుగా ఉన్న కోల్‌కతా నైట్‌ రైడర్స్, చైన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ అనూహ్యంగా తడబడుతుండగా, పెద్దగా అంచనాలు లేని జట్లు ఆకట్టుకుంటున్నాయి. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు ఒక్క ట్రోఫీ కూడా సాధించని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ లీగ్‌లో టాప్-3లో ఉన్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ పదో స్థానంలో నిలిచింది. 13 మ్యాచ్‌లు ముగిసిన తరువాత ప్రస్తుత పాయింట్ల పట్టిక ఇలా ఉంది.

Details

టాప్ ప్లేస్‌లో ఆర్సీబీ.. రెండో స్థానంలో పంజాబ్ 

ఈ సీజన్‌లో ఇప్పటి వరకు తాను ఆడిన రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన ఆర్సీబీ 4 పాయింట్లు, 2.266 నెట్ రన్‌రేట్‌తో అగ్రస్థానంలో కొనసాగుతోంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో నిన్న (ఏప్రిల్ 1) జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 8 వికెట్ల తేడాతో 22 బంతులు మిగిల్చి గెలిచింది. దీంతో ఆ జట్టు నెట్ రన్‌రేట్ మెరుగై 4 పాయింట్లతో 1.485 నెట్ రన్‌రేట్‌తో రెండో స్థానానికి చేరుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా తమ రెండు మ్యాచ్‌ల్లో గెలిచి 4 పాయింట్లు, 1.320 నెట్ రన్‌రేట్‌తో మూడో స్థానంలో ఉంది. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ ట్రోఫీ గెలవని బెంగళూరు, పంజాబ్, ఢిల్లీ జట్లు ప్రస్తుత సీజన్‌లో టాప్-3లో ఉండడం ఆసక్తికరంగా మారింది.

Details

చివరి స్థానంలో కోల్ కతా

గుజరాత్ టైటాన్స్ రెండు మ్యాచ్‌ల్లో ఒకటి గెలిచి, ఒకటి ఓడిపోవడంతో 2 పాయింట్లు, 0.625 నెట్ రన్‌రేట్‌తో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. మూడు మ్యాచ్‌ల్లో ఒకటి గెలిచి, రెండు ఓడిన ముంబై 2 పాయింట్లు, 0.309 నెట్ రన్‌రేట్‌తో ఐదో స్థానంలో ఉంది. పంజాబ్ చేతిలో ఓడిన లక్నో సూపర్ జెయింట్స్ 2 పాయింట్లు, -0.150 నెట్ రన్‌రేట్‌తో ఆరో స్థానానికి పడిపోయింది. ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (-0.771), గతేడాది రన్నరప్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (-0.871), రాజస్థాన్ రాయల్స్ (-1.112) తలా రెండు పాయింట్లతో వరుసగా ఏడో, ఎనిమిదో, తొమ్మిదో స్థానాల్లో ఉన్నాయి.

Details

ఇవాళ గుజరాత్, బెంగళూర్ మధ్య హోరాహోరీ పోటీ

మూడింట్లో ఒకదానిలో మాత్రమే గెలిచిన డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా 2 పాయింట్లు, -1.428 నెట్ రన్‌రేట్‌తో చివరి స్థానంలో కొనసాగుతోంది. ముంబై చేతిలో పెద్ద పరాజయం కోల్‌కతా నెట్ రన్‌రేట్‌పై తీవ్ర ప్రభావం చూపించింది. నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ పోరులో గెలిచి టాప్ ప్లేస్‌ను మరింత బలోపేతం చేసుకునేందుకు ఆర్సీబీ ప్రయత్నిస్తోంది. ఈ మ్యాచ్ ఎలా సాగుతుందో చూడాలి.