LOADING...
CSK vs KKR IPL 2026 Result: చెన్నై ఖాతాలో రెండో విజయం.. మరోసారి చిత్తుచిత్తుగా ఓడిన కోల్‌కతా
చెన్నై ఖాతాలో రెండో విజయం.. మరోసారి చిత్తుచిత్తుగా ఓడిన కోల్‌కతా

CSK vs KKR IPL 2026 Result: చెన్నై ఖాతాలో రెండో విజయం.. మరోసారి చిత్తుచిత్తుగా ఓడిన కోల్‌కతా

వ్రాసిన వారు Moogati Shabari
Apr 15, 2026
12:02 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2026 సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ఇంకా తొలి విజయాన్ని నమోదు చేయలేదు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో వచ్చిన ఒక పాయింట్ తప్పా, ఇప్పటివరకు ఆ జట్టు ఖాతాలో విజయం లేదు. తాజాగా చెపాక్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 32 పరుగుల తేడాతో ఘోర పరాజయం చవిచూసింది. 193 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కోల్‌కతా జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 160 పరుగులకే పరిమితమైంది.

వివరాలు

భారీ లక్ష్య ఛేదనలో పోరాటం

193 పరుగుల లక్ష్యాన్ని ఎదుర్కొంటూ ఇన్నింగ్స్ ప్రారంభించిన కేకేఆర్‌కి షాక్ త్వరగానే తగిలింది. ఫిన్ అలెన్ కేవలం 1 పరుగుకే అవుట్ అయ్యాడు. అన్షుల్ కంబోజ్ వేసిన బంతిని భారీ షాట్‌గా ఆడే ప్రయత్నంలో శివమ్ దూబేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. సునీల్ నరైన్ 17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 24 పరుగులు చేసి ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. కెప్టెన్ అజింక్యా రహానే 22 బంతుల్లో 2 సిక్సర్ల సాయంతో 28 పరుగులు చేసి నూర్ అహ్మద్ చేతిలో ఔటయ్యాడు.

వివరాలు

కొంప ముంచిన ప్లేయర్లు..

అంగ్క్రిష్ రఘువంశీ 19 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 27 పరుగులు చేసి అకీల్ హుస్సేన్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. జట్టును నిలబెడతాడని ఆశించిన రింకూ సింగ్ 12 బంతుల్లో ఒక్క బౌండరీ కూడా లేకుండా కేవలం 6 పరుగులకే నూర్ అహ్మద్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఇక కామెరూన్ గ్రీన్ అయితే గోల్డెన్ డకౌట్ కావడం KKRకు పెద్ద దెబ్బగా మారింది. అతన్ని కూడా నూర్ అహ్మద్ అవుట్ చేశాడు.

Advertisement

వివరాలు

హిట్టర్లు ఉన్నా హిట్టింగ్ లోపించిందిలా..

రింకూ సింగ్ అవుట్ అయిన సమయానికి కేకేఆర్ విజయానికి 43 బంతుల్లో 102 పరుగులు అవసరమయ్యాయి. ఇది కష్టమైనా అసాధ్యం కాని లక్ష్యం. ప్రతి ఓవర్‌లో రెండు భారీ షాట్లు ఆడితే మ్యాచ్‌ను చివరి వరకు తీసుకెళ్లే అవకాశం ఉండేది. క్రీజులో రమణ్‌దీప్ సింగ్, రోవ్‌మన్ పావెల్ వంటి హిట్టర్లు ఉన్నప్పటికీ, జట్టు ఆశించిన స్థాయిలో దూకుడు చూపలేకపోయింది. దీంతో మ్యాచ్ చివరి ఓవరుకు ముందే చెన్నై సూపర్ కింగ్స్ విజయం ఖరారైంది. రమణ్‌దీప్ సింగ్ 23 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 35 పరుగులు చేసి చివరి ఓవర్‌లో అవుట్ అయ్యాడు. రోవ్‌మన్ పావెల్ 31 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

Advertisement