Hardik Pandya : ముంబైకి భారీ ఊరట.. హార్దిక్ పాండ్యా ఆడుతాడా?
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2026 సీజన్‌ను ముంబయి ఇండియన్స్ విజయంతో ప్రారంభించింది. కానీ ఆ తరువాత అదే జోరును కొనసాగించడంలో కాస్త ఇబ్బందులు ఎదుర్కొంది. ఏప్రిల్ 4న జరిగిన రెండో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓటమి చవిచూసింది. ఆ మ్యాచ్‌కు ముంబై జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా అనారోగ్య కారణంగా దూరంగా ఉన్నాడు. అతని స్థానంలో సూర్యకుమార్ యాదవ్ తాత్కాలిక కెప్టెన్‌గా జట్టును నడిపించాడు. అయితే సూర్య జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. ఇక నేడు (ఏప్రిల్ 7) గౌహతిలో ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా ఆడుతాడా లేదా అన్న విషయంపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ముంబై బౌలింగ్ కోచ్ పరాస్ మ్హాంభ్రే స్పందించాడు.
వివరాలు
నెట్ ప్రాక్టీస్‌లో పాండ్యా..
హార్దిక్ ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడని ఆయన వెల్లడించాడు. అతనికి ఎలాంటి గాయం లేదని, కేవలం అనారోగ్యంతోనే గత మ్యాచ్‌కు దూరమయ్యాడని చెప్పారు. ప్రస్తుతం అతడు కోలుకుని నెట్ ప్రాక్టీస్‌లో కూడా పాల్గొంటున్నాడని వివరించాడు. 'రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌కు హార్దిక్ పాండ్యా సిద్ధంగా ఉన్నాడు. అతనికి ఎలాంటి గాయం లేదు. అనారోగ్యంతోనే గత మ్యాచ్‌లో ఆడలేకపోయాడు. ఇప్పుడు పూర్తిగా కోలుకుని రెండు నెట్ సెషన్లలో కూడా పాల్గొన్నాడు' అని మ్యాచ్‌కు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో పరాస్ మ్హాంభ్రే తెలిపాడు.
వివరాలు
పాయింట్ల పట్టికలో ఆరోస్థానం..
ఈ సీజన్‌లో ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ రెండు మ్యాచ్‌లు ఆడగా, ఒకటిలో గెలుపొందింది, మరొకటిలో ఓడిపోయింది. జట్టు ఖాతాలో ప్రస్తుతం రెండు పాయింట్లు ఉండగా, నెట్ రన్ రేట్ -0.206గా ఉంది. ప్రస్తుతం ముంబై జట్టు పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది. రాజస్థాన్‌పై భారీ విజయం సాధించి తమ పాయింట్లను పెంచుకోవడంతో పాటు నెట్ రన్ రేట్‌ను మెరుగుపరుచుకోవాలని ముంబై లక్ష్యంగా పెట్టుకుంది.