LOADING...
IPL 2026: ఐపీఎల్ 2026 ప్రైజ్ మనీ విడుదల.. ఛాంపియన్ ఆర్సీబీకి ఎన్ని కోట్లు వచ్చాయంటే?
ఐపీఎల్ 2026 ప్రైజ్ మనీ విడుదల.. ఛాంపియన్ ఆర్సీబీకి ఎన్ని కోట్లు వచ్చాయంటే?

IPL 2026: ఐపీఎల్ 2026 ప్రైజ్ మనీ విడుదల.. ఛాంపియన్ ఆర్సీబీకి ఎన్ని కోట్లు వచ్చాయంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 01, 2026
09:19 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2026 సీజన్‌కు తెరపడింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరోసారి ఛాంపియన్‌గా అవతరించి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ విజయంతో పాటు భారీ ప్రైజ్ మనీని కూడా సొంతం చేసుకుంది. రన్నరప్‌గా నిలిచిన గుజరాత్ టైటాన్స్‌తో పాటు ప్లేఆఫ్స్‌కు చేరిన ఇతర జట్లూ కోట్ల రూపాయల నగదు బహుమతులు అందుకున్నాయి.

వివరాలు

ఆర్సీబీకి రూ.20 కోట్ల జాక్‌పాట్

ఆదివారం రాత్రి జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఐదు వికెట్ల తేడాతో ఓడించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. దీంతో టోర్నీ చరిత్రలో బ్యాక్-టు-బ్యాక్ టైటిళ్లు గెలిచిన మూడో జట్టుగా రికార్డు సృష్టించింది. విజేతగా నిలిచిన ఆర్సీబీకి బీసీసీఐ రూ.20 కోట్ల ప్రైజ్ మనీని అందించింది. మరోవైపు తుది పోరులో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచిన శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ జట్టుకు రూ.12.5 కోట్ల నగదు బహుమతి లభించింది.

వివరాలు

మిగిలిన జట్లకు ఎంత దక్కింది?

ఫైనల్‌కు చేరుకోలేకపోయినా ప్లేఆఫ్స్‌లో ఆకట్టుకున్న జట్లు కూడా భారీ మొత్తాన్ని అందుకున్నాయి. క్వాలిఫయర్-2లో పరాజయం పాలై మూడో స్థానంలో నిలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టుకు రూ.7 కోట్ల ప్రైజ్ మనీ దక్కింది. ఎలిమినేటర్‌లో ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు రూ.6.5 కోట్ల నగదు బహుమతిని సొంతం చేసుకుంది.

Advertisement

వివరాలు

కోహ్లీ మెరుపులు.. ఆర్సీబీకి మరో కప్పు

ఫైనల్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. జట్టులో వాషింగ్టన్ సుందర్ 37 బంతుల్లో అర్ధశతకం నమోదు చేసి పోరాడాడు. ఆర్సీబీ బౌలర్లలో రాసిఖ్ సలామ్ దార్ మూడు వికెట్లు తీసి మెరిశాడు. జోష్ హేజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్ ఆరంభంలోనే గుజరాత్‌కు గట్టి దెబ్బ కొట్టారు. 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు జట్టు ఇంకా రెండు ఓవర్లు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. ఈ విజయానికి విరాట్ కోహ్లీ ప్రధాన శిల్పిగా నిలిచాడు. తన ఐపీఎల్ కెరీర్‌లోనే అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీని కేవలం 25 బంతుల్లో పూర్తి చేసిన కోహ్లీ, ప్లేఆఫ్స్‌లో తన అత్యుత్తమ స్కోరును నమోదు చేశాడు.

Advertisement

వివరాలు

అలసట గుజరాత్‌ను ప్రభావితం చేసిందా?

42 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 75 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 2025 సీజన్ నుంచి కోహ్లీ అర్ధశతకం సాధించిన మ్యాచ్‌ల్లో ఆర్సీబీ ఓడిపోలేదనే సెంటిమెంట్ ఈ ఫైనల్‌లోనూ కొనసాగింది. ఫైనల్ ఓటమి తర్వాత గుజరాత్ టైటాన్స్ శిబిరంలో ఆత్మపరిశీలన ప్రారంభమైంది. గత ఆరు రోజుల్లో మూడు వేర్వేరు నగరాల్లో మూడు కీలక మ్యాచ్‌లు ఆడాల్సి రావడం ఆటగాళ్లపై ప్రభావం చూపిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాతావరణ పరిస్థితుల కారణంగా శనివారం రాత్రి ఆలస్యంగా అహ్మదాబాద్ చేరుకున్న జట్టుకు విశ్రాంతి తీసుకునే అవకాశం కూడా పెద్దగా లభించలేదు.

వివరాలు

అన్ని విభాగాల్లో అద్భుత ప్రదర్శన చేసిన ఆర్సీబీ

అయితే ఈ ఓటమికి అలసటను కారణంగా చూపబోనని గుజరాత్ క్రికెట్ డైరెక్టర్ విక్రమ్ సోలంకి స్పష్టం చేశాడు. ఫైనల్‌లో బెంగళూరు అన్ని విభాగాల్లోనూ అద్భుత ప్రదర్శన చేసిందని, కొన్ని సందర్భాల్లో ప్రత్యర్థి మెరుగైన ఆటను అంగీకరించి అభినందించాల్సిందేనని పేర్కొంటూ క్రీడాస్ఫూర్తిని చాటాడు.

Advertisement