IPL 2025: "ఐపీఎల్‌కు ఎంఎస్ ధోనీ అవసరం": బీసీసీఐ అన్‌క్యాప్డ్ ప్లేయర్ రూల్.. ఆనందోత్సహాలలో అభిమానులు
ప్రతి సారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సమీపిస్తే, 'కెప్టెన్ కూల్' ఎంఎస్ ధోని పేరు చర్చలోకి వస్తుంది. ఈ సీజన్‌లో ధోనీ ఆడతాడా? లేదా? అనే ప్రశ్న అభిమానుల్లో ఉత్కంఠ రేపుతోంది. వచ్చే ఎడిషన్ కోసం బీసీసీఐ రిటెన్షన్ విధానం ప్రకటించగా,ఐదేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినవారిని అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌గా బరిలోకి దిగేందుకు అవకాశం ఇవ్వనుంది. అయితే, ఇది కేవలం భారత క్రికెటర్లకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది. దీని ప్రకారం, చెన్నై సూపర్ కింగ్స్ ధోనీని అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌గా తీసుకోవడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఫ్యాన్స్ కూడా తమ హీరోను మళ్లీ మైదానంలో చూడగలరనే ఉత్సాహంలో ఉన్నారు.నెట్టింట,"ధోనీ లేకుండా ఐపీఎల్ చూడలేం " అంటూ కామెంట్లు చేస్తున్నారు.
నెట్టింట కామెంట్లు
''ధోనీకి ఐపీఎల్‌లో ఆడాల్సిన అవసరం లేదు, కానీ ఐపీఎల్‌కు ధోనీ చాలా అవసరం. మరో సీజన్‌కు దిగ్గజం సిద్ధమవుతాడనేది పక్కా.'' ''ధోనీ అన్‌క్యాప్‌డ్ అయినా లేదా సాధారణ ప్లేయర్‌గా ఎలా వచ్చినా మాకు ఇబ్బందేం లేదు. ధోనీని చూడటమే మాకు కావాలి'' ''చెన్నై ధోనీని రూ.4 కోట్లకు రిటైన్ చేస్తుంది. కానీ అతని వంటి వ్యక్తి అలాంటి రిటెన్షన్‌కు అర్హుడు కాదు, ఐదు ఐపీఎల్ ట్రోఫీలను గెలిపించిన కెప్టెన్‌ను అలా చేయకూడదు.'' ''ధోనీకి డబ్బుతో పని లేదు. జట్టుతో ఉంటే చాలు అంటూ తనను తాను తగ్గించుకుంటున్నాడు''
ఈసారి బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పు ఉంటుందా?
ఈసారి ధోనీ బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పు ఉంటుందా? అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌గా ధోనీను తీసుకుంటే, అభిమానులు గతేడాదిలా చివర్లో కాకుండా ముందుగానే బ్యాటింగ్‌కు రావాలని కోరుతున్నారు. 2024 ఐపీఎల్‌లో చివరి ఓవర్లో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక స్ట్రైక్ రేట్‌తో పరుగులు సాధించిన సంగతి తెలిసిందే. ఎనిమిదో స్థానంలో కూడా బ్యాటింగ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ, మిడిల్ ఆర్డర్‌లో నాలుగు లేదా ఐదో స్థానంలో వస్తే, ప్రత్యర్థి జట్లకు భయానకంగా ఉంటుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ధోనీ గతేడాదితో పోలిస్తే ఇప్పుడు మరింత ఫిట్‌గా ఉన్నాడని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. మరి ధోనీ తీసుకునే నిర్ణయం ఏంటో చూడాలి.