IPL 2025 Retention: ఆండ్రీ రస్సెల్‌ను విడుదల చేసే అవకాశం.. కేకేఆర్ రిటైన్ లిస్ట్ ఇదే..
ఐపీఎల్ 2025కు ముందు మెగా వేలం జరగబోతుందని అందరికీ తెలిసిందే. ఈ వేలానికి సంబంధించి రిటెన్షన్ నిబంధనలను ఇటీవల బీసీసీఐ ప్రకటించింది. ఓ ఫ్రాంచైజీ గరిష్టంగా ఆరుగురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకోవచ్చు. ప్రాంచైజీలు రిటెన్షన్ లిస్ట్‌ను సమర్పించడానికి అక్టోబర్ 31 చివరి తేది అని పేర్కొంది. ఈ నేపధ్యంలో ఏ ప్రాంచైజీ ఎవరి ని రిటైన్ చేసుకుంటుందో తెలుసుకోవడం ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే, డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) కొన్ని ఆసక్తికర నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారం. కేకేఆర్ కేవలం నలుగురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకోవాలని నిర్ణయించింది.
అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా రాణా రిటైన్
ఈ జాబితాలో మిస్టరీ స్పిన్నర్లు సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, పేసర్ హర్షిత్ రాణా, హిట్టర్ రింకూ సింగ్‌లు ఉన్నారు. మొదటి పిక్కుగా నరైన్, రెండవ పిక్కుగా రింకూ, మూడవ ఆటగాడిగా వరుణ్ ఉండగా, అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా రాణాను రిటైన్ చేస్తారు. అయితే, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ విషయంలో ఇంకా స్పష్టత లేదు, ఎందుకంటే మరొక ఫ్రాంచైజీ అతనికి మెగా డీల్ ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది.
రెండుసార్లు ఛాంపియన్‌గా నిలబెట్టడంలో కీలక పాత్ర
ఇక కేకేఆర్ తీసుకున్న షాకింగ్ నిర్ణయం ఏమిటంటే, స్టార్ ఆల్‌రౌండర్, ఛాంపియన్ ప్లేయర్ ఆండ్రీ రస్సెల్‌ను విడుదల చేసే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ అతడిని నిలబెట్టుకోవాలనుకుంటే జీతంపై చర్చలు జరుగుతున్నాయట. 2014 నుండి రస్సెల్ కేకేఆర్‌లో ఉండి, జట్టును రెండుసార్లు ఛాంపియన్‌గా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించాడు. గత మెగా వేలంలో రూ.12 కోట్లకు రస్సెల్‌ను కేకేఆర్ రిటైన్ చేసుకుంది.