Lalit Modi: ఐపీఎల్‌లో పెట్టుబడుల పోటీ..వచ్చే ఐదేళ్లలో భారీ పెరుగుదల!
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 19వ సీజన్ దగ్గరపడుతున్న నేపథ్యంలో రెండు ప్రధాన ఫ్రాంచైజీలకు సంబంధించిన కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ), రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) జట్లలో వాటాలు కొనుగోలు చేయడానికి ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు తీవ్ర పోటీ పడుతున్నాయి. ఈ వారాంతానికి ఈ ఒప్పందాలు పూర్తి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ స్థాపకుడు లలిత్ మోడీ లీగ్ భవిష్యత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ ఆర్థిక పరిమాణాన్ని పూర్తిగా మార్చే అంచనాలను ఆయన వెల్లడించారు.
వివరాలు
ఐదేళ్లలో రెట్టింపు ఆదాయం..
ప్రస్తుతం ఉన్న విలువలతో పోలిస్తే ఐపీఎల్ జట్ల విలువ రాబోయే ఐదేళ్లలో గణనీయంగా పెరుగుతుందని లలిత్ మోడీ తెలిపారు. ప్రస్తుతం ఒక జట్టు విలువ సుమారు 2 బిలియన్ డాలర్లుగా ఉంటే, ప్రతి సంవత్సరం 20 శాతం వృద్ధితో ఐదేళ్లలో అది కనీసం 5 బిలియన్ డాలర్లకు చేరుతుందన్నారు. అది కూడా కనీస అంచనా మాత్రమ అని ఆయన చెప్పారు. అదనంగా, మరో ఏడు నుంచి ఎనిమిది సంవత్సరాల్లో అమెరికా ఎన్‌బీఏ లీగ్ ఫ్రాంచైజీల స్థాయికి (8 నుంచి 10 బిలియన్ డాలర్లు) ఐపీఎల్ జట్లు చేరుతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
వివరాలు
డిజిటల్ రంగమే ప్రధాన కారణం..
ఈ వేగవంతమైన వృద్ధికి భారత్‌లో విస్తరిస్తున్న డిజిటల్ రంగమే ప్రధాన కారణమని లలిత్ మోడీ వివరించారు. 2030 నాటికి భారత్‌లో స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల సంఖ్య 120 కోట్లకు చేరుతుందని, 5జీ టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో డేటా వినియోగం మరింతగా పెరుగుతుందన్నారు. భవిష్యత్తులో క్రీడా ప్రసారాలు టెలివిజన్ కంటే స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా ఎక్కువగా చూడబడతాయన్నారు. తదుపరి మీడియా హక్కుల వేలం కూడా ప్రధానంగా స్ట్రీమింగ్ హక్కులపైనే ఆధారపడుతుందని ఆయన పేర్కొన్నారు.
వివరాలు
అతి పెద్ద క్రీడా ఈవెంట్ ఇదేనా..
ప్రస్తుతం ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న క్రీడా ఈవెంట్ ఐపీఎల్ మాత్రమే అని లలిత్ మోడీ అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకు మీడియా హక్కుల విలువ ప్రధానంగా ప్రకటనల ఆదాయంపై ఆధారపడి ఉండగా, భవిష్యత్తులో సబ్‌స్క్రిప్షన్ ఆధారిత మార్కెట్ భారీగా పెరుగుతుందన్నారు. దాని ద్వారా ఐపీఎల్ ఆదాయం అంచనాలకు మించి పెరిగే అవకాశముందని ఆయన విశ్లేషించారు. ఈ సమయంలో ఆర్‌సీబీ, రాజస్థాన్ రాయల్స్ జట్లకు సంబంధించిన ఒప్పందాలు జరుగుతుండటంతో, ఆయన చేసిన అంచనాలు పెట్టుబడిదారుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి.