IRE vs IND: తొలి టీ20లో భారీ వర్షం.. టీమిండియా విజయం
ఐర్లాండ్ తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో భారత్ శుభారంభం చేసింది. తొలి టీ20 మ్యాచులో టీమిండియా రెండు పరుగుల తేడాతో గెలుపొందింది. భారత బౌలర్లు సమిష్టిగా రాణించి జట్టుకు విజయాన్ని అందించారు. మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ జట్లు భారత బౌలర్ల దాటికి విలవిల్లాడింది. 31 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి ఐర్లాండ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. చివర్లో బ్యారీ మెక్ కార్థి 33 బంతుల్లో ( 4ఫోర్లు, 4 సిక్సర్లు) 51 పరుగులు, కర్తీక్ కాంఫర్ 33 బంతుల్లో (3 ఫోర్లు, 1 సిక్సర్) 39 పరుగులతో చెలరేగడంతో ఐర్లాండ్ గౌరవప్రదమైన స్కోరును చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి ఐర్లాండ్ 139 పరుగులు చేసింది.
రెండు వికెట్లతో రాణించిన బుమ్రా
భారత బౌలర్లలో కెప్టెన్ జస్ప్రిత్ బుమ్రా, ప్రసిద్ధ కృష్ణ, రవి బిష్ణోయ్ రెండు వికెట్లతో రాణించగా, హర్షదీప్ సింగ్ ఒక వికెట్ తీశారు. లక్ష్య చేధనలో భారత్ కు యశస్వీ జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ అదిరే ఆరంభాన్ని అందించారు. వీరిద్దరూ తొలి వికెట్ కు 45 పరుగులను జోడించారు. అయితే ఏడో ఓవర్లో ఐర్లాండ్ పేసర్ క్రెయిగ్ యంగ్ వరుస బంతుల్లో జైస్వాల్, తిలక్ వర్మలను బౌల్డ్ చేశాడు. ఇదే ఓవర్ ఓవర్ చివరి బంతికి వర్షం మొదలు కావడంతో ఆట నిలిచిపోయింది. వర్షం ఎంతకీ తగ్గడంతో అంపైర్లు డక్ వర్త్ లూయిస్ ప్రకారం భారత్ ను విజేతగా ప్రకటించారు. రెండో టీ20 ఆదివారం జరగనుంది.