Ishan kishan : చెన్నైతో పోరాడాం.. బౌలర్లే గెలిపించారంటూ ఇషాన్ కామెంట్స్..
ఈ వార్తాకథనం ఏంటి
బ్యాటింగ్‌లో మంచి ఆరంభం దక్కుతున్నప్పటికీ, దాన్ని చివరి వరకు కొనసాగించడంలో సన్‌రైజర్స్ జట్టు సమస్యలు ఎదుర్కొంటోంది. ఒకప్పుడు సులభంగా 220కి పైగా స్కోర్లు నమోదు చేసిన ఈ జట్టు, ఇప్పుడు 200 పరుగుల వద్దే ఆగిపోతోంది. అయినప్పటికీ, గత రెండు మ్యాచ్‌లలో బౌలర్ల అద్భుత ప్రదర్శనతో సన్‌రైజర్స్ విజయాలను సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒక దశలో 230కు పైగా స్కోర్ చేస్తారని అనిపించినా, చివరికి 190కు పైగా పరుగులకే పరిమితమైంది. అయితే యువ బౌలర్లు చివరి వరకు పోరాడుతూ జట్టుకు విజయాన్ని అందించారు. ఈ విషయాన్ని ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ కూడా వివరించాడు.
వివరాలు
ఆరంభంలో దూకుడు..
యువ పేసర్లు తమ ప్రణాళికలను సమర్థంగా అమలు చేసి విజయం సాధించడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశాడు. వారు తమ స్వంత ఆలోచనలను కూడా జోడించి బౌలింగ్ చేయడం ప్రశంసనీయం అని తెలిపాడు. ఇలాంటి పరిస్థితుల్లో కెప్టెన్‌గా ఫీల్డింగ్ అమరికలు చేయడం కూడా సులభంగా మారుతుందని చెప్పాడు. యువ ఆటగాళ్లు ముందుండి జట్టును గెలిపించేందుకు కృషి చేయడం మంచి సంకేతమని అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచ్‌లో కూడా తమ జట్టు కనీసం 20 నుంచి 40 పరుగులు తక్కువగా చేసినట్టు ఆయన అంగీకరించాడు. అభిషేక్ శర్మ ఆరంభంలో దూకుడుగా ఆడి మంచి స్టార్ట్ ఇచ్చాడని, ఆ సమయంలో 230 పరుగుల వరకు చేరుకుంటామని భావించామని తెలిపాడు.
వివరాలు
వారిపై నమ్మకం ఉంచితే అద్భుత ఫలితాలు..
మొదటి ముగ్గురు బ్యాటర్లలో ఒకరు తప్పకుండా పెద్ద స్కోరు చేస్తారని అనుకున్నామని చెప్పాడు. అయితే ఇలాంటి బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న జట్టు మరింత ఎక్కువ పరుగులు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు. అయినప్పటికీ, ఈ తక్కువ స్కోరును కూడా కాపాడగల సామర్థ్యం తమ యువ బౌలర్లకు ఉందని వారు నిరూపించారని ఆయన అన్నారు. వారిపై నమ్మకం ఉంచితే అద్భుత ఫలితాలు సాధించగలరని వారి ప్రదర్శన చూపించిందని పేర్కొన్నారు. హైదరాబాద్ పిచ్ సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని, అలాంటి పరిస్థితుల్లో కూడా తమ బౌలర్లు కష్టపడి బాగా ఆడారని చెప్పారు.
వివరాలు
షాట్ ఎంపికలో మెరుగుదల అవసరం..
కొన్ని పరుగులు తక్కువ చేసినా, మ్యాచ్‌ను గెలిపించడం వారి ప్రతిభకు నిదర్శనమని అన్నారు. ఈ మ్యాచ్ నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు కూడా ఉన్నాయని, ముఖ్యంగా షాట్ ఎంపికలో ఇంకా మెరుగుదల అవసరమని ఆయన పేర్కొన్నారు. పాయింట్ల పట్టిక గురించి ఇప్పుడే ఆలోచించడం లేదని, ఇది దీర్ఘకాలిక లీగ్ కావడంతో ప్రతి మ్యాచ్‌ను గెలవడంపైనే దృష్టి పెట్టామని ఇషాన్ కిషన్ స్పష్టం చేశాడు.