Loading...
Hardik Pandya: హార్దిక్‌ లాంటి ఆటగాడు దొరకడం అదృష్టమే.. పంజాబ్‌ కీలక వ్యాఖ్యలు!
హార్దిక్‌ లాంటి ఆటగాడు దొరకడం అదృష్టమే.. పంజాబ్‌ కీలక వ్యాఖ్యలు!

Hardik Pandya: హార్దిక్‌ లాంటి ఆటగాడు దొరకడం అదృష్టమే.. పంజాబ్‌ కీలక వ్యాఖ్యలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 14, 2026
04:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

వచ్చే ఐపీఎల్‌ సీజన్‌లో టైటిల్‌ గెలవడమే లక్ష్యంగా బరిలోకి దిగనున్నట్లు పంజాబ్‌ కింగ్స్‌ సహ యజమాని బర్మన్‌ వెల్లడించారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో జట్టు నిర్మాణంతో పాటు టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య ట్రేడింగ్‌పైనా ఆయన మాట్లాడారు. రెండేళ్ల కిందట శ్రేయస్‌ అయ్యర్‌ నాయకత్వంలో పంజాబ్‌ ఫైనల్‌కు చేరుకుంది. అయితే రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు చేతిలో ఓటమిపాలైంది. జట్టులో సరైన ఆల్‌రౌండర్‌ లేకపోవడంతో హార్దిక్‌ పాండ్య వైపు మొగ్గు చూపింది. ఈ క్రమంలో తొలి నుంచీ జట్టుతో ఉన్న అర్ష్‌దీప్‌ సింగ్‌ను వదులుకుంది. పాండ్య కోసం పంజాబ్‌ రూ.18 కోట్లు వెచ్చించగా.. ముంబయి తరఫున అతడు రూ.16.35 కోట్లు అందుకున్నాడు.

వివరాలు

హార్దిక్‌ రాకతో జట్టుకు బలం..

'హార్దిక్‌ పాండ్య వంటి ఆటగాడిని తీసుకునే అవకాశం తరచూ రాదు. అతడు ప్రపంచంలోని అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో ఒకడు.

బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ మ్యాచ్‌ ఫలితాన్ని మార్చగల సత్తా ఉంది. సారథిగా అతడికున్న అనుభవం కూడా క్లిష్ట పరిస్థితుల్లో జట్టుకు ఉపయోగపడుతుంది.

ఇప్పటికీ మా స్క్వాడ్‌ చాలా బలంగా ఉంది. 2025 ఐపీఎల్‌ ఫైనల్‌కు చేరుకున్నాం. అయితే వచ్చే ఏడాది టైటిల్‌ గెలవడమే మా లక్ష్యం.

హార్దిక్‌ రాకతో జట్టులో సమతూకం వస్తుందని భావిస్తున్నా. టీ20ల్లో అతడు చాలా విలువైన ఆటగాడని బర్మన్‌ తెలిపారు.

వివరాలు

శ్రేయస్‌ అయ్యర్‌తో కలిసి ఆడటంపై

శ్రేయస్‌ అయ్యర్‌ నాయకత్వంలో హార్దిక్‌ పాండ్య ఆడటంపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని బర్మన్‌ అభిప్రాయపడ్డారు. ''ఇది కచ్చితంగా జట్టుకు పెద్ద ప్రయోజనం.

శ్రేయస్‌ చాలా బాగా జట్టును నడిపిస్తున్నాడు. అతడి సారథ్యంలోనే మేం ఫైనల్‌కు చేరుకున్నాం. హార్దిక్‌కు కూడా జట్టును నడిపించిన అనుభవం ఉంది.

ఇలాంటి మైండ్‌సెట్‌ కలిగిన ఇద్దరు ఆటగాళ్లు డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఉంటే యువ క్రికెటర్లు కూడా వారి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఇది జట్టుకు ప్రయోజనం చేకూరుస్తుంది'' అని పేర్కొన్నారు.

ADVERTISEMENT

వివరాలు

అర్ష్‌దీప్‌ను వదలడం కఠిన నిర్ణయం

భారత్‌ తరఫున అత్యధిక టీ20 వికెట్లు తీసిన బౌలర్‌గా అర్ష్‌దీప్‌ సింగ్‌ రికార్డు సృష్టించాడు. ఐపీఎల్‌లో అరంగేట్రం చేసినప్పటి నుంచి పంజాబ్‌ జట్టుకే ప్రాతినిధ్యం వహించాడు.

అలాంటి ఆటగాడిని వదులుకోవడంపై బర్మన్‌ స్పందించారు. ''మాకు ఇది చాలా క్లిష్టమైన నిర్ణయం. పంజాబ్‌ కింగ్స్‌ విజయాల్లో అర్ష్‌దీప్‌ కీలక పాత్ర పోషించాడు.

దేశంలోనే అత్యుత్తమ ఫాస్ట్‌ బౌలర్లలో ఒకడిగా ఎదిగిన అతడి ప్రయాణాన్ని చూశాం. పంజాబ్‌కు చెందిన అర్ష్‌దీప్‌కు భారీ అభిమానగణం ఉంది.

అయితే క్రీడల్లో కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది'' అని బర్మన్‌ వెల్లడించారు.

ADVERTISEMENT