AUS vs IND: విరాట్ కోహ్లీని రెచ్చగొట్టడం ప్రమాదకరం.. ఆస్ట్రేలియాకు గ్లెన్ మెక్‌గ్రాత్ సూచన
న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌ను 0-3 తేడాతో కోల్పోయిన టీమిండియా, ఇప్పుడు మరో ప్రతిష్ఠాత్మకమైన సిరీస్ కోసం సిద్ధమవుతోంది. నవంబర్ 22 నుంచి ఆస్ట్రేలియాలో ఐదు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుండగా, ఈ సారి విరాట్ కోహ్లీపై ప్రధాన బాధ్యత ఉందని క్రికెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. గత కొన్ని సిరీస్‌లలో విరాట్ ఫామ్ అంతగా లేదు. ఆస్ట్రేలియాలో అతని రికార్డు మాత్రం అద్భుతంగా ఉంది. అయితే ఆసీస్ బౌలర్లు కోహ్లీని టార్గెట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆసీస్ మాజీ పేసర్ గ్లెన్ మెక్‌గ్రాత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత జట్టుపై ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తోందని, కోహ్లీని టార్గెట్ చేయడం మంచిది కాదన్నారు.
కోహ్లీ రాణిస్తే ఆపడం అసాధ్యం
కానీ, అతడిని రెచ్చగొట్టడంలో ఏదైనా పొరపాటు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కోహ్లీ ఒకసారి రాణిస్తే అతన్ని ఆపడం అసాధ్యమని పేర్కొన్నారు. స్లెడ్జింగ్ వల్ల ఆసీస్ జట్టుపైనే ప్రభావం పడొచ్చని, కోహ్లీపై ఒత్తిడి పెంచడమే సరైన వ్యూహమని మెక్‌గ్రాత్ అభిప్రాయపడ్డారు. భారత్-ఆస్ట్రేలియా ఐదు టెస్టుల సిరీస్ మాత్రమే కాకుండా, వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ రేసులో కీలక పాత్ర పోషించనుంది. రెండు జట్లకు ఇది కీలకమైన పరీక్షగా మారనుంది. రోహిత్ శర్మ గైర్హాజరీలో టీమిండియా ఎలా రాణిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.