Rohit Sharma: 26 లేదా 27 ఏళ్ల వయస్సులో కెప్టెన్ అయి ఉంటే బాగుండేంది.. కెప్టెన్సీపై రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారత జట్టును ముందుండి నడిపించి ఎన్నో చిరస్మరణీయమైన విజయాలను అందించారు. రోహిత్ శర్మ సారథ్యంలో ఆసియా కప్‌ను గెలుచుకున్న భారత్, తాజాగా వన్డే ప్రపంచ కప్ బరిలోకి దిగుతోంది. రేపటి నుంచి వన్డే వరల్డ్ కప్ 2023 సమరం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ కెప్టెన్సీపై ఆసక్తికర విషయాలను వెల్లడించారు. 26 లేదా 27 ఏళ్ల వయస్సులో జాతీయ జట్టుకు కెప్టెన్సీ చేసే అవకాశం వస్తే బాగుండేదని, అయితే జీవితంలో అనకున్న వెంటనే ఏదీ జరగదని హిట్ మ్యాన్ చెప్పాడు.
మ్యాచ్ విన్నర్లకు కెప్టెన్సీ అవకాశం రాలేదు
మ్యాచ్ విన్నర్లుగా నిలిచిన చాలామంది ఆటగాళ్లకు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టి అవకాశం రాలేదని, అయితే జట్టులో అద్భుతమైన ప్లేయర్లు ఉన్నప్పటికీ ప్రస్తుతం తనకు అవకాశం వచ్చిందని రోహిత్ శర్మ పేర్కొన్నారు. భారత క్రికెట్ చరిత్రలో ఎంతోమంది అద్భుతమైన ప్లేయర్లు ఉన్నారని, వారందరూ కూడా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడానికి అర్హులని వెల్లడించారు. గౌతమ్ గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్ లాంటి స్టార్ ప్లేయర్లు కెప్టెన్సీ చేపట్టలేదన్నారు. యువరాజ్ సింగ్ మ్యాచ్ విన్నర్ అని, అతడికి కెప్టెన్సీ వచ్చినట్లే వచ్చి చేజారిపోయిందని, జీవితం అంటే అంతేనని రోహిత్ వివరించారు.