Ravindra Jadeja: కోహ్లి-రోహిత్ తర్వాత టి20 ఇంటర్నేషనల్ నుండి రిటైర్ అయ్యిన జడేజా
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తర్వాత భారత జట్టు స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కూడా అంతర్జాతీయ టీ20కి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా ఆయన ఈ సమాచారాన్ని అందించారు. అయితే, అతను ఇతర ఫార్మాట్లలో భారత్ తరపున ఆడటం కొనసాగించనున్నాడు. శనివారం బార్బడోస్‌లో దక్షిణాఫ్రికాను ఏడు పరుగుల తేడాతో ఓడించి టీ20 ప్రపంచకప్ 2024 టైటిల్‌ను భారత్ కైవసం చేసుకుంది.
ఇన్‌స్టా ఖాతాలో జడేజా పోస్ట్
''నేను మనస్ఫూర్తిగా అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలుకుతున్నాను. ఎల్లప్పుడూ నా దేశం కోసం నా శక్తిమేరకు అత్యుత్తమ ప్రదర్శన చేశా. ఇతర ఫార్మాట్‌లలో (వన్డేలు, టెస్టులు) కెరీర్‌ను కొనసాగిస్తాను. టీ20 ప్రపంచకప్‌ను గెలవాలనే కల నిజమైంది. ఇది నా అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో ఉన్నతమైన శిఖరం. ఇన్నాళ్లు నాకు మద్దతుగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు'' అని జడేజా తన ఇన్‌స్టా ఖాతాలో వరల్డ్ కప్ ట్రోఫీని పట్టుకుని దిగిన ఫొటోని పోస్టు చేశాడు.