Jai Shah: ఐసీసీ ఛైర్మన్‌గా జై షా బాధ్యతల స్వీకరణ.. క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయం
బీసీసీఐ సెక్రటరీ జై షా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నూతన ఛైర్మన్‌గా ఇవాళ అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఐసీసీ తన ప్రకటనలో జై షా ఈ రోజు నుంచి ఛైర్మన్ హోదాలో తన పదవీకాలాన్ని ప్రారంభించారని వెల్లడించింది. ఆయన ఈ పదవిలో వచ్చే రెండేళ్ల పాటు కొనసాగనున్నారు. ఈ ఏడాది ఆగస్టులో జరిగిన ఎన్నికల్లో జై షా ఏకగ్రీవంగా ఐసీసీ ఛైర్మన్ పదవికి ఎన్నికయ్యారు. ఆయన పేరుకు మాత్రమే నామినేషన్ దాఖలు కావడంతో, ఎటువంటి పోటీ లేకుండానే క్రికెట్ ప్రపంచంలోని అత్యున్నత బోర్డుకు ఆయన నాయకత్వం అందించారు. ప్రస్తుతం జై షా ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) అధ్యక్షుడిగా, బీసీసీఐ సెక్రటరీగా కొనసాగుతున్నారు.
క్రికెట్ ను ప్రపంచ వ్యాప్తంగా విస్తరించడమే తన లక్ష్యం
ఐసీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించడం వల్ల ఈ రెండు పదవులకు ఆయన రాజీనామా చేసే అవకాశముంది. ఐసీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా జై షా మాట్లాడారు. క్రికెట్‌ను ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరించడమే తన ప్రధాన లక్ష్యమని, 2028 లాస్ ఏంజిలెస్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను ప్రవేశపెట్టడం అనేది అత్యంత ముఖ్యమైన ప్రయత్నమని పేర్కొన్నారు. 2025లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ ఆయన ఛైర్మన్ హోదాలో నిర్వహించనున్న తొలి టోర్నమెంట్ కావడం విశేషం. జై షా ఐసీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ఐదో భారతీయుడిగా నిలిచారు. గతంలో ఈ గౌరవాన్ని జగన్మోహన్ దాల్మియా, శరద్ పవార్, ఎన్ శ్రీనివాసన్, శశాంక్ మనోహర్‌లు పొందారు.
అతి పిన్న వయస్కుడిగా రికార్డు
ఐసీసీ చరిత్రలో ఈ పదవిని చేపట్టిన అతి పిన్న వయస్కుడిగా కూడా జై షా రికార్డు సృష్టించారు. జై షా నాయకత్వంలో ఐసీసీ ముందు భారీ సవాళ్లు ఉన్నాయి. ముఖ్యంగా క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో ప్రవేశపెట్టడం, కొత్త మార్కెట్లలో క్రికెట్‌ను విస్తరించడం, సభ్య దేశాల మద్దతును సమర్థంగా సమన్వయం చేయడం వంటి బాధ్యతలు ఉన్నాయి. బాధ్యతలు స్వీకరించిన అనంతరం జై షాకు సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తాయి.