
Jasprit Bumrah: ఇంగ్లాండ్ సిరీస్‌లో అరుదైన మైలురాయికి చేరువలో బుమ్రా
ఈ వార్తాకథనం ఏంటి
భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఒక అరుదైన ప్రపంచ రికార్డు దిశగా దూసుకెళ్తున్నాడు.
త్వరలో ఇంగ్లాండ్‌తో ప్రారంభమయ్యే టెస్ట్ సిరీస్‌లో ఈ ఘనతను తన ఖాతాలో వేసుకునే అవకాశం బుమ్రాకు ఉంది.
గుండె దడిపించే బుల్లెట్ బంతులు,అత్యంత కచ్చితమైన యార్కర్లతో ప్రత్యర్థులను ఇబ్బంది పెడుతున్న బుమ్రా, పాకిస్థాన్ మాజీ పేస్ దిగ్గజం వసీం అక్రమ్ పేరిట నిలిచిన ఓ అరుదైన రికార్డును అధిగమించేందుకు సన్నద్ధమవుతున్నాడు.
ఇప్పటివరకు విదేశాల్లో 31 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన బుమ్రా,మొత్తం 145 వికెట్లు తీసిన సంగతి తెలిసిందే.
మరొక వికెట్ పడగొడితే అక్రమ్ (146 వికెట్లు)సరసన చేరిపోతాడు.
రెండు వికెట్లు సాధిస్తే విదేశాల్లో అత్యధిక టెస్ట్ వికెట్లు తీసిన ఆసియాకు చెందిన వేగబౌలర్గా బుమ్రా చరిత్ర సృష్టిస్తాడు.
వివరాలు
ఇంగ్లాండ్ గడ్డపై బుమ్రాకు మంచి ట్రాక్ రికార్డు
ఈ రికార్డు బుమ్రా ఖాతాలో చేరితే, ఆధునిక కాలపు గొప్ప ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా అతని పేరు మరింతగా వెలుగులోకి వస్తుంది.
ఇదిలా ఉంటే, ఇంగ్లాండ్ గడ్డపై బుమ్రాకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. 2018లో ఇంగ్లాండ్‌లో జరిగిన తన తొలి టెస్టులోనే ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా ఐదు వికెట్లతో అదరగొట్టాడు.
ఇప్పటివరకు ఇంగ్లాండ్‌లో 9 టెస్టుల్లో 17 ఇన్నింగ్స్‌లు ఆడి 37 వికెట్లు తీసిన బుమ్రా, 2021లో లార్డ్స్ మైదానంలో భారత్‌కు చారిత్రక విజయం అందించడంలో బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌తోనూ కీలకంగా నిలిచాడు.
ఈ నెల 20న లీడ్స్ వేదికగా ప్రారంభమయ్యే ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో బుమ్రాకు ఈ ఘనతను అందుకునే అవకాశముంది.
వివరాలు
బుమ్రాకి విశ్రాంతి ఇచ్చే యోచనలో బీసీసీఐ
అయితే గాయాల కారణంగా ఇటీవల అతడు కొన్ని మ్యాచ్‌లు మిస్సవడంతో బీసీసీఐ, భారత జట్టు మేనేజ్మెంట్ అతని ఫిట్‌నెస్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించింది.
దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని, కొన్నిచోట్ల అతనికి విశ్రాంతి ఇచ్చే యోచనలో ఉన్నట్లు సమాచారం.
ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో పలు కీలక ఘనతలను సాధించిన బుమ్రా, అత్యంత వేగంగా 200 టెస్ట్ వికెట్లు తీసిన భారత పేసర్‌గా నిలిచాడు.
అంతేకాదు, ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టెస్టు, వన్డే, టీ20 మూడు ఫార్మాట్లలోనూ అగ్రస్థానాన్ని అందుకున్న ఏకైక బౌలర్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఒంటిచేత్తో మ్యాచ్‌లను మలుపు తిప్పగల సత్తా ఉన్న బుమ్రా, ఈ అరుదైన రికార్డును ఖాతాలో వేసుకుంటాడా అన్న ఆసక్తి ఇప్పుడు క్రికెట్ అభిమానుల్లో నెలకొంది.