భారత్ పేసర్ జయదేవ్ ఉనద్కత్ అరుదైన ఘనత
భారత్ పేసర్ జయదేవ్ ఉనద్కత్ అరుదైన ఘనత సాధించాడు. 2023 రంజీ ట్రోఫీలో రాజ్ కోట్‌లో సౌరాష్ట్ర తరుపున 100వ ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లో ఆడాడు. ఇటీవల ఢిల్లీపై సౌరాష్ట్ర విజయం సాధించడంతో ఈ లెఫ్టార్మ్ సీమర్ హ్యాట్రిక్ సాధించాడు. బంగ్లాదేశ్ సిరీస్ సందర్భంగా 12 సంవత్సరాల తర్వాత టీమిండియా జట్టులో స్థానం సంపాదించుకున్న విషయం తెలిసిందే. మ్యాచ్‌కు ఒకరోజు ముందు ఎడమచేతికి గాయమైందని, వేలికి రక్తం కారుతున్న అలాగే మ్యాచ్ ఆడానని జయదేవ్ ఉనద్కత్ గుర్తు చేశాడు. తాను ఫస్ట్ క్లాస్ మ్యాచ్ అరంగేట్రం చేసిన క్షణం తనకు క్షుణంగా గుర్తుకు ఉందని, 99 మ్యాచ్‌లు పూర్తి చేసి వందో మ్యాచ్ ఆడినందుకు గర్వంగా ఉందని ఉనద్కత్ తెలిపారు
ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్‌కు ఎంపిక
ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఉనద్కత్ అద్భుతంగా రాణించాడు. 99 మ్యాచ్‌లు ఆడి 22.65 సగటుతో 370 వికెట్లను తీసి సత్తా చాటాడు. 2019-20 రంజీ ట్రోఫీలో 67 వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. మొదటి స్థానంలో బీహార్‌కు చెందిన అశుతోష్ అమన్ (68) ఉన్నాడు. డిసెంబర్ 2010లో తన టెస్టు అరంగేట్రం చేసిన ఉనద్కత్, తన రెండో టెస్టు కోసం 12 ఏళ్లకు పైగా వేచి ఉండాల్సి వచ్చింది. గత నెలలో బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో తిరిగి పునరాగమనం చేశాడు. రెండు టెస్టుల మధ్య అత్యధిక గ్యాప్ తీసుకున్న భారత క్రికెటర్‌గా జయదేవ్ రికార్డును సొంతం చేసుకున్నాడు. త్వరలో ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్‌లో జయదేవ్ స్థానం సంపాదించుకున్నారు.