LOADING...
Jofra Archer History: చరిత్రలో నిలిచిన జోఫ్రా ఆర్చర్.. ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో అరుదైన ఘనత
చరిత్రలో నిలిచిన జోఫ్రా ఆర్చర్.. ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో అరుదైన ఘనత

Jofra Archer History: చరిత్రలో నిలిచిన జోఫ్రా ఆర్చర్.. ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో అరుదైన ఘనత

వ్రాసిన వారు Moogati Shabari
May 29, 2026
10:32 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ పోరులో రాజస్థాన్ రాయల్స్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ అసాధారణ ప్రదర్శనతో ప్రత్యేక రికార్డు సృష్టించాడు. న్యూ చండీగఢ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో సన్‌ రైజర్స్ హైదరాబాద్‌పై రాజస్థాన్ విజయం సాధించడంలో ఆర్చర్ కీలక పాత్ర పోషించాడు. బ్యాటింగ్‌లో వైభవ్ సూర్యవంశీ కేవలం 29 బంతుల్లో 97 పరుగులు చేసి ఆకట్టుకోగా, బౌలింగ్, ఫీల్డింగ్‌లో ఆర్చర్ మెరిసి మ్యాచ్‌ను పూర్తిగా రాజస్థాన్ వైపు మళ్లించాడు.

వివరాలు

ఆ రికార్డు సాధించిన తొలి ఆటగాడు..

243 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టుకు ఆర్చర్ ప్రారంభంలోనే గట్టి షాక్ ఇచ్చాడు. ప్రమాదకర ఓపెనర్ అభిషేక్ శర్మను ఖాతా తెరవకముందే ఔట్ చేశాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ 33 పరుగుల వద్ద, ట్రావిస్ 17 పరుగుల వద్ద వికెట్లు తీసి పవర్‌ప్లేలోనే ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచాడు. మొత్తం మూడు కీలక వికెట్లు తీసిన ఆర్చర్, ఫీల్డింగ్‌లో కూడా అదే స్థాయి ప్రభావం చూపించాడు. మ్యాచ్ సందర్భంగా స్మరణ్ రవిచంద్రన్, ప్యాట్ కమిన్స్, ఈషాన్ మలింగ క్యాచ్‌లను అందుకున్న ఆర్చర్ మొత్తం మూడు క్యాచ్‌లు పట్టాడు. దీంతో ఐపీఎల్ ప్లేఆఫ్స్ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసి, మూడు క్యాచ్‌లు అందుకున్న తొలి ఆటగాడిగా నిలిచాడు.

వివరాలు

ఆ ప్రత్యేక జాబితాలో జోఫ్రా ఆర్చర్‌కు చోటు..

ఐపీఎల్ మొత్తం చరిత్రను పరిశీలిస్తే, ఈ తరహా ప్రదర్శన చేసిన మూడో ఆటగాడిగా ఆర్చర్ గుర్తింపు పొందాడు. 2013లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున డ్వేన్ బ్రావో ఈ ఘనత సాధించగా, 2019లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున కగిసో రబాడ నాలుగు వికెట్లు తీసి మూడు క్యాచ్‌లు పట్టాడు. ఇప్పుడు ఆ ప్రత్యేక జాబితాలో జోఫ్రా ఆర్చర్ కూడా చోటు సంపాదించాడు. ఈ సీజన్‌లో ఆర్చర్ అద్భుత ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే 24 వికెట్లు సాధించి పర్పుల్ క్యాప్ పోటీలో బలమైన అభ్యర్థిగా నిలిచాడు. అలాగే రాజస్థాన్ రాయల్స్ తరఫున రెండు సార్లు 20కి పైగా వికెట్లు తీసిన తొలి పేసర్‌గా కూడా కొత్త చరిత్ర రాశాడు.

Advertisement

వివరాలు

క్వాలిఫయర్-2లో రాజస్థాన్ రాయల్స్ vs గుజరాత్ టైటాన్స్

ఇంకా ఒక విశేషం ఏమిటంటే, ఐపీఎల్ 2026లో తొలి ఓవర్‌లోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో కూడా ఆర్చర్ ముందంజలో ఉన్నాడు. ఈ సీజన్‌లో తొలి ఓవర్‌ల్లోనే ఏడు వికెట్లు సాధించి అరుదైన రికార్డు నమోదు చేశాడు. ఈ జాబితాలో 2020 సీజన్‌లో ఎనిమిది వికెట్లు తీసిన ట్రెంట్ బౌల్ట్ మాత్రమే అతనికంటే ముందున్నాడు. ఇప్పుడు క్వాలిఫయర్-2లో రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటాన్స్‌ను ఎదుర్కోనుంది. ఆర్చర్ ఇదే స్థాయి ప్రదర్శన కొనసాగిస్తే, రాజస్థాన్ ఫైనల్‌కు చేరే అవకాశాలు మరింత బలపడతాయి. ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైనల్‌లోకి అడుగుపెట్టింది.

Advertisement