Amaravati: సీఎం చంద్రబాబును కలిసిన కపిల్‌దేవ్.. గోల్ఫ్ అభివృద్ధిపై చర్యలు
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్, ఏసీఏ అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ఉండవల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా, రాష్ట్రంలో గోల్ఫ్ కోర్స్ స్థాపనపై గురించి చర్చించారు. సమావేశం అనంతరం కపిల్‌దేవ్ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడికి క్రీడలపై విపరీతమైన ఆసక్తి ఉందన్నారు. గోల్ఫ్ కోర్స్‌ల ఏర్పాటుకు ఇండియన్ గోల్ఫ్ అసోసియేషన్ తరఫున సహకారం అందించేందుకు సన్నద్ధంగా ఉందన్నారు.
ఏపీ క్రీడాభివృద్ధికి అంబాసిడర్‌గా కపిల్‌దేవ్?
రాష్ట్రం భూమి కేటాయిస్తే, స్పోర్ట్స్ సిటీ అభివృద్ధి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కపిల్ దేవ్ స్పష్టం చేశారు. అనంతపురం, అమరావతి, విశాఖపట్నం ప్రాంతాల్లో గోల్ఫ్ కోర్సులు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని కేశినేని చిన్ని పేర్కొన్నారు. కపిల్‌దేవ్‌ను రాష్ట్ర అంబాసిడర్‌గా నియమించాలనే ఆలోచనలో ఉన్నామని, గ్రామీణ క్రీడాకారులకు అవకాశాలు కల్పించి, అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేలా ప్రోత్సహిస్తామని ఆయన చెప్పారు.