పాయింట్ల పట్టికలో పైకొచ్చిన కేకేఆర్.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్‌లో స్పల్ప మార్పులు
చిన్నస్వామి వేదికగా జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీపై కేకేఆర్ 21 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 200 పరుగుల భారీ స్కోరు చేసింది. లక్ష్య చేధనలో ఆర్సీబీ బ్యాటర్లు తడబడటంతో.. 8 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. అయితే ఈ ఓటమితో పాయింట్ల పట్టికలో ఆర్సీబీ స్థానం మారలేదు. బెంగళూర్ 8 మ్యాచ్లో నాలుగు విజయాలతో 8 పాయింట్లు సాధించి ఐదోస్థానంలో నిలిచింది. మరోపక్క ఈ సీజన్లో మూడో విజయాన్ని అందుకున్న కేకేఆర్ ఏడోస్థానానికి ఎగబాకింది. 8 మ్యాచ్ లో 3 విజయాలు సాధించిన కేకేఆర్ ముంబాయి కంటే మెరుగైన రన్ రేట్ సాధించి పైకి వచ్చింది. ముంబై మూడు విజయాలతో ఎనిమిదో స్థానంలో ఉంది.
అగ్రస్థానంలో ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్
ఆర్సీబీ రెగ్యులర్ కెప్టెన్ డుప్లెసిస్ 8 మ్యాచ్ ల్లో 422 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ లీడ్ లో కొనసాగుతున్నాడు. కేకేఆర్ పై 54 పరుగులు చేసిన కోహ్లీ.. 333 పరుగులతో రెండో స్థానానికి చేరాడు. చైన్నై బ్యాటర్ డేవాన్ కాన్వే 314 పరుగులు, కేకేఆర్ బ్యాటర్ వెంకటేష్ 285 పరుగులతో తర్వాతి స్థానాల్లో నిలిచారు. బెంగళూర్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ 14 వికెట్లు సాధించి పర్పుల్ క్యాప్ ని సొంతం చేసుకున్నాడు. రషీద్ ఖాన్ 14 వికెట్లతో సిరాజ్ ను సమం చేశాడు. వరుణ్ చక్రవర్తి, అర్షదీప్ సింగ్ 13 వికెట్లు, చాహెల్ 12 వికెట్లతో తర్వాతి స్థానంలో నిలిచారు.