Sarfaraz vs KL Rahul: గిల్ రీ ఎంట్రీ.. వేటు అతనిపైనే!
న్యూజిలాండ్‌తో సిరీస్‌ను భారత జట్టు ఓటమితో ప్రారంభించింది. ఇక ఈ రెండో టెస్టుకు ముందు టీమిండియా జట్టు అసిస్టెంట్ కోచ్ గుడ్ న్యూస్ చెప్పారు. గాయం కారణంగా తొలి టెస్టుకు దూరమైన శుభమాన్ గిల్ అందుబాటులో ఉంటాడని చెప్పారు. మరోవైపు జట్టులో మార్పులు, గిల్ ఫిట్‌నెస్, రాహుల్ ఫామ్ వంటి అంశాలపై స్పష్టత ఇచ్చారు. గిల్ ఇప్పుడు పూర్తి ఫిట్‌గా ఉన్నాడని, అయితే తుదిజట్టులో చోటు కోసం కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్‌లలో ఒకరిని తప్పించడం అనివార్యమవుతుందని పేర్కొన్నారు. సర్ఫరాజ్ ఖాన్ తొలి టెస్టులో అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ, కేఎల్ రాహుల్ మాత్రం పరుగులు చేయడంలో విఫలమయ్యాడు.
కేఎల్ రాహుల్ ఫామ్ పై ఆందోళన అవసరం లేదు
కేఎల్ రాహుల్ ప్రదర్శనపై ఎటువంటి ఆందోళన అవసరం లేదని, అతడి ఫామ్ గురించి కూడా పెద్దగా బెంగ లేదని, రాహుల్‌కి మరిన్ని అవకాశాలు ఇవ్వాలని కోచ్ గౌతం గంభీర్ భావిస్తున్నాడని కోచ్ తెలిపారు. రిషభ్ పంత్ ఆరోగ్యంగా ఉండటంతో, పుణెలో జరిగే రెండో టెస్టులో అతడే వికెట్ కీపింగ్ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. మరోవైపు గిల్ స్థానంలో విరాట్ కోహ్లి వన్‌డౌన్ స్థానం దక్కించుకోగా, సర్ఫరాజ్ ఖాన్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసి సెంచరీతో చెలరేగాడు.