యాషెస్ సిరీస్ కు ఆ పదం ఎలా వచ్చిందో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!
141 సంవత్సరాల చరిత్ర కలిగిన యాషెస్ సిరీస్‌ను ఇంగ్లండ్, ఆస్ట్రేలియా క్రికెట్ అభిమానులు ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. రెండేళ్లకు ఒకసారి జరిగే సిరీస్ మళ్లీ వచ్చేసింది. రేపటి నుంచి ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్టుల మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో యాషెస్ అనే పేరు ఎలా వచ్చిందో మనం తెలుసుకుందాం. 1882లో లండన్‌లోని ఓవల్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచులో ఆస్ట్రేలియా గెలుపొందింది. అయితే సొంతగడ్డపై ఇంగ్లండ్‌కు అదే తొలి ఓటమి. దీంతో అప్పటి 'స్టోర్టింగ్ టైమ్స్'లో విలేకరి రెజినాల్డ్‌షిర్లీ ఆగస్టు 29, 1882 నాడు ఓవల్‌లో ఇంగ్లిష్ క్రికెట్ మరణించింది. ఆ శరీరాన్ని కాల్చి బూడిద(యాషెస్)ను ఆస్ట్రేలియా తీసుకెళ్లిందంటూ రాశాడు.
తొలి టెస్టు జూన్ 16న ప్రారంభం
కొన్ని వారాల తర్వాత ఆస్ట్రేలియాలో పర్యటించిన ఇంగ్లాండ్ జట్టు క్రిస్‌మస్ సందర్భంగా ఓ మ్యాచ్ ఆడింది. ఈ క్రమంలో మట్టితో చేసిన చిన్న కప్పును ప్రదర్శించిన ఇంగ్లండ్ ఐవో బ్లై ఇదే యాషెస్ కు గుర్తు అని, దీన్ని తిరిగి గెలుస్తామని ప్రమాణం చేశాడు. అప్పటి నుంచి ఈ రెండు జట్ల మధ్య టెస్టు సిరీస్‌కు యాషెస్ అనే పేరు వచ్చింది. అదే విధంగా నిజమైన యాషెస్ కప్పు లార్డ్స్‌లోని మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ మ్యూజియంలో ఉంది. ప్రస్తుతం విజేతలకు దాని నమూనాగా కప్పును మాత్రమే అందిస్తున్నారు. ఈ ట్రోఫీని యూఆర్ఎన్ అని కూడా పిలుస్తారు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్టు జూన్ 16 నుంచి 20 వరకు జరగనుంది.