ఐసీసీ ర్యాంకుల్లో ఆస్ట్రేలియా బ్యాటర్లు ముందంజ.. దూసుకొచ్చిన అంజిక్య రహానే
డబ్ల్యూటీసీ ఫైనల్లో ఇండియాపై గెలుపొందిన ఆస్ట్రేలియా టెస్టు ర్యాంకుల్లోనూ సత్తా చాటింది. ఆసీస్ కు చెందిన బ్యాటర్లు టాప్ 3 లో ఉండటం విశేషం. లబుషన్, స్టీవ్ స్మిత్, హెడ్ తొలి మూడు ర్యాంకులను సొంతం చేసుకున్నారు. ఇక భారత మిడిలార్డర్ బ్యాటర్ అంజిక్య రహానే వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిఫ్ పైనల్లో కీలక ఇన్నింగ్స్ ఆడటంతో ఏకంగా 37 స్థానానికి ఎగబాకాడు. అదే విధంగా హాఫ్ సెంచరీతో రాణించిన శార్దుల్ ఠాకూర్ ఆరు స్థానాలకు మెరుగుపర్చుకొని 94వ ర్యాంకును సొంతం చేసుకున్నాడు. టీమిండియా తరుపున రిషబ్ పంత్ (758) మాత్రమే టాప్ 10లోనే కొనసాగుతున్నాడు. ఇక రోహిత్ శర్మ 12వ ర్యాంకు, విరాట్ కోహ్లీ 13వ ర్యాంక్ కు దిగజారారు.
నెంబర్ వన్ స్థానంలో అశ్విన్
ఇక బౌలింగ్ విభాగంలో రవిచంద్రన్ అశ్విన్ (860 పాయింట్లు) తో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. జేమ్స్ అండర్సన్ (850), పాట్ కమిన్స్(829) వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచారు. గాయం కారణంగా డబ్ల్యూటీసీ ఫైనల్ కు దూరమైన జస్ప్రీత్ బుమ్రా (772) రెండు స్థానాలను కోల్పోయి 8వ స్థానానికి పడిపోయాడు. రవీంద్ర జడేజా (765) పాయింట్లతో 9వ స్థానంలో ఉన్నాడు. బ్యాటింగ్ విభాగంలో ఇప్పటివరకూ రెండో స్థానంలో ఉన్న కేన్ విలియమ్సన్ నాలుగో స్థానానికి పడిపోయాడు. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్లో మొదటి సారి న్యూజిలాండ్ చేతిలో ఓడిన టీమిండియా, రెండోసారి ఆస్ట్రేలియా చేతిలో ఓడి రన్నరప్ తో సరిపెట్టుకుంది.