Asia Cup 2023: భారత్ బ్యాట్సమెన్ సెంచరీల మోత.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
ఆసియా కప్ 2023 సూపర్ 4 మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ సెంచరీలతో చెలరేగడంతో భారత్ 50 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 356 పరుగుల భారీ స్కోరు సాధించింది. కోహ్లీ 94 బంతుల్లో 122*పరుగులు చేయగా, రాహుల్ 106 బంతుల్లో 111*పరుగులు చేశాడు. ఈ ఇద్దరూ దూకుడుగా ఆడి మూడో వికెట్‌కి డబుల్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. వీరితో పాటు శుభమన్ గిల్ 58, రోహిత్ శర్మ 56 పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో షాదాబ్ ఖాన్,షాహీన్ అఫ్రిది చెరో వికెట్ తీశారు. గాయం నుంచి కోలుకున్న కెఎల్ రాహుల్ సెంచరీతో చెలరేగాడు. వన్డేల్లో అతనికి ఇది ఆరో సెంచరీ కాగా,కోహ్లీ వన్డేల్లో తన 47వ సెంచరీ చేశాడు.
ఈ ఏడాదిలో 1000 అంతర్జాతీయ పరుగులు చేసిన కోహ్లీ
ఆదివారం 24.1 ఓవర్లలో 147/2 స్కోరుతో రిజర్వ్ డేలో ఆటను ప్రారంభించిన తర్వాత KL రాహుల్,విరాట్ కోహ్లీ ఆటను ధాటిగా ఆడి పాక్ బౌలర్లకు చుక్కలు చూపించారు. కోహ్లీ 2023 ఏడాదిలో 1000 అంతర్జాతీయ పరుగులు పూర్తి చేశాడు .ఓవరాల్‌గా విరాట్ కోహ్లీ ఒకే ఏడాదిలో వెయ్యికి పైగా అంతర్జాతీయ పరుగులు చెయ్యడం ఇది 12వ సారి. అంతకముందు సచిన్ టెండూల్కర్ 16 సార్లు, కుమార సంగర్కర 15 సార్లు, జాక్వస్ కలీస్ 14, కుమార జయవర్థనే 14, రికీ పాంటింగ్ 13 సార్లు,వెయ్యికి పైగా పరుగులు చేసి విరాట్ కోహ్లీ కంటే ముందున్నారు. 11 సార్లతో తరువాతి స్థానంలో రాహుల్ ద్రావిడ్, మహేంద్ర సింగ్ ధోనీ ఉన్నారు.
13వేల క్లబ్‌లో కోహ్లీ
విరాట్ కోహ్లీ వన్డే క్రికెట్‌లో 13000 పరుగులు పూర్తి చేశాడు. అతను ఈ చరిత్రాత్మక ఫీట్‌ను చేరుకోవడానికి 267 ఇన్నింగ్స్‌లు మాత్రమే తీసుకున్నాడు. 50 ఓవర్ల ఫార్మాట్‌లో ప్రపంచంలోనే అత్యంత వేగంగా 13000 పరుగులు చేసిన ఆటగాడు. 321 ఇన్నింగ్స్‌ల్లో ఈ మార్కును చేరుకున్న సచిన్ టెండూల్కర్‌ను అధిగమించాడు.