IPL 2025 : ఆర్‌సీబీలో ఫాఫ్ కొనసాగడం కోహ్లీకి ఇష్టమే.. ఏబీ డివిలియర్స్
ఐపీఎల్ 2025 కోసం రిటెన్షన్, రైట్ టు మ్యాచ్ నిబంధనలపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) స్పష్టతను ఇచ్చింది. అక్టోబర్ 31లోపు అన్ని ప్రాంఛైజీలు తమ రిటెన్షన్ జాబితాలను సమర్పించాల్సి ఉంటుంది. అనంతరం నవంబర్ మూడో వారంలో మెగా వేలం జరగనుంది. ఈ తరుణంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) కెప్టెన్‌గా ఎవరు ఉంటారన్న దానిపై ఆసక్తి పెరుగుతోంది. రోహిత్ శర్మను తీసుకుని కొత్త సారథిగా నియమించాలనే చర్చలు నెట్టింట వ్యాపిస్తున్నాయి. అయితే దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ ఫాఫ్ డుప్లెసిస్‌ను రిటైన్ చేసి, అతడికి కెప్టెన్సీ అప్పగిస్తే మంచిదని అభిప్రాయపడ్డాడు.
గ్లెన్ మాక్స్‌వెల్‌ను కూడా పక్కన పెట్టే అవకాశం
ఫాఫ్ డుప్లెసిస్ వయసు పట్ల అనేక మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, కానీ వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే అని యూట్యూబ్ ఛానెల్‌లో డివిలియర్స్ చెప్పారు. ఆర్‌సీబీకి ఫాఫ్ కెప్టెన్‌గా కప్ అందించడంలో విఫలమయ్యాడు కానీ అతడికి కొంత మద్దతు ఉండాలని చెప్పారు. ప్రస్తుతం బెంగళూరు రిటైన్ జాబితా పట్ల క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయాలు విభిన్నంగా ఉన్నాయి. ఫాఫ్ డుప్లెసిస్‌తో పాటు, గ్లెన్ మాక్స్‌వెల్‌ను కూడా పక్కన పెట్టే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. విరాట్ కోహ్లీ, మహ్మద్ సిరాజ్, విల్ జాక్స్, రజత్ పటీదార్, కామెరూన్ గ్రీన్, యశ్ దయాళ్ వంటి ఆటగాళ్లు రిటెన్షన్ జాబితాలో ఉండే అవకాశముందని తెలుస్తోంది. దీనిపై మరికొన్ని రోజుల్లో క్లారిటీ రానుంది.