LOADING...
IPL 2026: కోల్‌కతా ఖాతా తెరుస్తుందా? నేడు పంజాబ్‌తో కీలక సమరం
కోల్‌కతా ఖాతా తెరుస్తుందా? నేడు పంజాబ్‌తో కీలక సమరం

IPL 2026: కోల్‌కతా ఖాతా తెరుస్తుందా? నేడు పంజాబ్‌తో కీలక సమరం

వ్రాసిన వారు Moogati Shabari
Apr 06, 2026
10:52 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్‌ సీజన్‌లో ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు ఆడి రెండింటిలోనూ విజయాలు సాధించిన జట్టు ఒకవైపు ఉండగా, మరో జట్టు మాత్రం వరుసగా రెండు ఓటములను ఎదుర్కొంది. ఈ విభిన్న పరిస్థితుల్లో ఉన్న రెండు జట్లు ఇప్పుడు పరస్పరం తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. మంచి ఫామ్‌లో ఉన్న పంజాబ్‌ కింగ్స్‌తో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ సోమవారం మ్యాచ్‌ ఆడనుంది. ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌, హర్షిత్‌ రాణా, ఆకాశ్‌ దీప్‌, పతిరణ వంటి ప్రధాన బౌలర్లు జట్టులో లేకపోవడంతో కోల్‌కతా బౌలింగ్‌ విభాగం బలహీనంగా మారింది. ఈ పరిస్థితుల్లో సొంత మైదానంలో పంజాబ్‌ను ఎలా ఎదుర్కుంటుందో ఆసక్తికరంగా మారింది.

వివరాలు 

గాయంతో ఆల్‌రౌండర్‌ కామెరూన్‌ గ్రీన్‌ బౌలింగ్‌కు దూరం

ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో భారీ స్కోరు నమోదు చేసినప్పటికీ, బౌలింగ్‌లో విఫలమవడంతో రహానే నాయకత్వంలోని జట్టు ఓటమి పాలైంది. అనంతరం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా బౌలింగ్‌ విభాగం మరలా అధిక పరుగులు ఇచ్చింది. తర్వాత బ్యాటింగ్‌లోనూ తడబడటంతో మరో పరాజయం చవిచూడాల్సి వచ్చింది. గాయంతో ఆల్‌రౌండర్‌ కామెరూన్‌ గ్రీన్‌ బౌలింగ్‌కు దూరంగా ఉండటం కూడా ఆ జట్టుకు నష్టంగా మారింది. పంజాబ్‌ జట్టును నిలువరించాలంటే, కోల్‌కతా బౌలింగ్‌లో గట్టి ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉంది. ఉత్కంఠభరితంగా సాగిన తొలి మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌పై విజయం సాధించిన శ్రేయస్‌ అయ్యర్‌ నాయకత్వంలోని జట్టు, తర్వాతి మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ను ఓడించి టోర్నీలో రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది.

Advertisement