Page Loader
చరిత్ర సృష్టించిన కుశాల్ భుర్టెల్.. వన్డేలో 1000 పరుగులు చేసిన మూడో నేపాలీగా రికార్డు
1000 పరుగులు చేసిన మూడో నేపాలీగా రికార్డు

చరిత్ర సృష్టించిన కుశాల్ భుర్టెల్.. వన్డేలో 1000 పరుగులు చేసిన మూడో నేపాలీగా రికార్డు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Sep 04, 2023
06:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

నేపాల్ క్రికెట్ ప్లేయర్, స్టార్ బ్యాటర్ కుశాల్ భుర్టెల్ అద్భుతమైన మైలురాయిని సాధించాడు. ఈ మేరకు వన్డేలో వెయ్యి పరుగులు చేసిన మూడో నేపాల్ బ్యాట్స్ మెన్ గా రికార్డులకెక్కాడు. ఆసియా కప్ -2023లో భాగంగా శ్రీలంకలోని ముల్తాన్ క్రికెట్ స్టేడియంలో భారత్‌ - నేపాల్ మ్యాచ్‌లో భాగంగా కుశాల్ ఈ ఫీట్ ను అందుకున్నాడు. ఇప్పటికే పాకిస్థాన్ చేతిలో ఘోరంగా ఓటమి పాలైన నేపాల్, తన రెండో మ్యాచ్‌ భారత్ తో తలపడుతున్న సందర్భంగా ఈ రైట్ హ్యాండెడ్ బ్యాటర్ ఈ మార్కును చేరుకున్నాడు. నేపాల్ క్రికెట్ జట్టులో అనుభవజ్ఞుడైన ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ గా గుర్తింపు పొందిన కుశాల్, ఆరో పరుగు ద్వారా 1000 పరుగుల మార్క్ మైలురాయిని చేజిక్కించుకున్నాడు.

DETAILS

2023లోనూ మెరుగ్గా రాణిస్తున్న నేపాల్ బ్యాటర్ కుశాల్

2021లో నేపాల్ తరఫున వన్డేల్లో అరంగేట్రం చేసిన కుశాల్ భుర్టెల్, వన్డే క్రికెట్‌లో 1,000 పరుగులను సాధించిన మూడో బ్యాటర్ గా అవతరించాడు. 26 ఏళ్ల కుశాల్ భుర్టెల్ వన్డే ఫార్మాట్‌లో కేవలం 22 (22.93) సగటుతో కొనసాగుతున్నాడు. మరోవైపు వెయ్యి రన్స్ చేసిన నేపాల్ బ్యాటర్లలో రోహిత్ పౌడెల్, ఆసిఫ్ షేక్ మాత్రమే కుశాల్ కంటే ముందువరుసలో ఉన్నారు. ఇప్పటివరకు 46 వన్డేలు ఆడిన కుశాల్, ఆరు అర్ధసెంచరీలు, ఒక సెంచరీని నమోదు చేశాడు. 2023 ఏడాదిలో 21 వన్డే మ్యాచులు ఆడిన కుశాల్, 28.09 సగటుతో 590 పరుగులు చేశాడు. ఈ సంవత్సరం అత్యధిక పరుగులు సాధించిన నేపాల్ ఆటగాళ్లలో కుశాల్ టాప్ ప్లేస్ లో దూసుకెళ్తుండటం గమనార్హం.