నేడు భారత్-నేపాల్ మధ్య తొలి అంతర్జాతీయ మ్యాచ్.. భారీ స్కోరు కోసం ఉవ్విళ్లూరుతున్న రోహిత్ సేన
ఆసియాకప్‌లో ఇవాళ భారత్ - నేపాల్ తలపడనున్నాయి.భారత్-నేపాల్ మధ్య జరుగుతున్న తొలి అంతర్జాతీయ మ్యాచ్‌లో భారీ విజయం సాధించాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది. ఈ మేరకు సూపర్ -4 బెర్త్ ఖరారు చేసుకోవాలని భావిస్తోంది. శనివారం పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో భారత్ బ్యాటింగ్ లోపాలను సవరించుకుని పసికూన నేపాల్‌పై చెలరేగాలని రోహిత్ సేన ప్లాన్ చేస్తోంది. పాక్‌తో మ్యాచ్‌లో పాయింట్లు పంచుకున్న భారత్, నేపాల్‌తో పోరులో విజృంభించేందుకు రెడి అయ్యింది.మరోవైపు ఈ మ్యాచ్‌కూ వర్షం ముప్పు పొంచి ఉండటం ఆందోళన కలిగిస్తోంది. టోర్నీలో భారత్ ఇప్పటివరకు శుభారంభం చేయలేదు.దీంతో ఈ నేపాల్ తో జరిగే పోరులో గ్రాండ్ విక్టరీతో గ్రూప్-ఏలో అగ్రస్థానంలో నిలిచేందుకు ప్రయత్నిస్తోంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లోనూ వాన పడినా,టీమిండియా 2 పాయింట్లు సాధిస్తుంది.
రాణించాల్సిన టాప్ ఆర్డర్
పాక్ పేసర్లతో ఇబ్బంది పడ్డ భారత టాప్ ఆర్డర్ నేపాల్‌పై దుమ్మురేపాల్సి ఉంది. కెప్టెన్ రోహిత్‌శర్మ, విరాట్ కోహ్లి స్టార్ ఇన్నింగ్స్ ఆడేందుకు రంగం సిద్ధమైంది. ఫామ్ దొరకబుచ్చుకునేందుకు శుభ్‌మన్ గిల్ కు ఈ మ్యాచ్ మరో అవకాశం. గాయం నుంచి కోలుకున్న శ్రేయస్ అయ్యర్‌కు ఈ మ్యాచ్ అద్భుతమైన అవకాశంగా నిలవనుంది. అంచనా జట్లు : భారత్ : రోహిత్, శుభ్‌మన్, కోహ్లి, ఇషాన్ కిషన్, హార్దిక్, జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్‌దీప్ యాదవ్, షమి/ప్రసిద్ధ్ కృష్ణ, సిరాజ్ నేపాల్ : రోహిత్ పౌడెల్ (కెప్టెన్), కుశాల్ బర్టెల్, అసిఫ్ షేక్, అరిఫ్ షేక్, సోమ్‌పాల్, దీపేంద్ర సింగ్, గుల్షాన్ జా, కుశాల్ మల్లా, కరణ్, సందీప్ లమిచానె, లలిత్ రాజ్‌బాన్షీ