Page Loader
ENG vs IND: లార్డ్స్‌ స్లోప్‌ పరీక్ష.. భారత ఆటగాళ్లకు కఠిన సవాలే!
లార్డ్స్‌ స్లోప్‌ పరీక్ష.. భారత ఆటగాళ్లకు కఠిన సవాలే!

ENG vs IND: లార్డ్స్‌ స్లోప్‌ పరీక్ష.. భారత ఆటగాళ్లకు కఠిన సవాలే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 10, 2025
01:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇంగ్లండ్‌లోని లార్డ్స్‌ మైదానాన్ని 'క్రికెట్‌ మక్కా'గా పరిగణిస్తారు. దాదాపు 200 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ స్టేడియానికి అది ఒరిగిన ఖ్యాతి. ఇంగ్లాండ్‌ సిరీస్‌ ప్రత్యేకంగా ఉంటే, అందులో లార్డ్స్‌ టెస్ట్‌ మ్యాచ్‌ జరగడం అంటే మరింత విశిష్టత. ఇక్కడ ఆడటం.. విజయం సాధించడం ప్రపంచవ్యాప్తంగా ఆటగాళ్లకు కల. అందుకే ఈ మైదానంలో గెలిచి, భారత మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ చొక్కా విప్పి గాల్లో ఊపిన దృశ్యం ఇప్పటికీ గుర్తుండిపోతుంది.

Details

లార్డ్స్‌ వాలుగా ఉండే మైదానం

ఇప్పటి వరకు 148 టెస్ట్‌ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చిన లార్డ్స్‌ మైదానంలో గ్రాండ్‌ స్టాండ్‌ వైపు నుంచి టవెర్న్‌ వైపు దాదాపు 2.5 మీటర్ల వాలుగా ఉంటుంది. ఇది కొండ ప్రాంతానికి సమీపంలో మైదానం నిర్మించడమే కారణం. మైదానాన్ని సమతుల్యం చేయాలన్న ప్రతిపాదనలు వచ్చినా, మేరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ (MCC) వాటిని సమర్థించలేదు.

Details

స్లోప్‌ వల్ల ఆటగాళ్లకు ఇబ్బందులు

ఈ వాలు ఆటగాళ్ల సహజ ఆటకు అంతరాయం కలిగిస్తుంది. బ్యాటర్లు, బౌలర్లు, ఫీల్డర్లంతా తమ శైలిలో మార్పులు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా నర్సరీ ఎండ్‌ నుంచి బౌలింగ్‌ చేసే స్వింగ్‌ బౌలర్లకు ఇది అనుకూలంగా ఉంటుంది. కుడిచేతి బ్యాటర్లకు బంతి దూరంగా వెళ్తే, ఎడమచేతి వాటం బ్యాటర్లకు లోపలికి వచ్చేస్తుంది. అయితే, సహజ ఔట్‌ స్వింగ్‌ బౌలింగ్‌ చేసే జేమ్స్‌ అండర్సన్‌ లాంటి బౌలర్లు ఈ వాలుతో గందరగోళానికి లోనయ్యారు. అందుకే ఆయన తన కెరీర్‌లో ఎక్కువగా 'పెవిలియన్‌ ఎండ్‌' నుంచి బౌలింగ్‌ చేయడం ఇష్టపడ్డారు. అలానే సీమర్లు పెవిలియన్‌ ఎండ్‌ నుంచి బౌలింగ్‌ చేస్తే, కుడిచేతి బ్యాటర్లకు బంతి లోపలికి స్వింగ్‌ అవుతుంది.

Details

 ఎడమచేతి బౌలర్లకు అదనపు అస్త్రం

ఈ మైదానం స్వభావం ఎడమచేతి వాటం బౌలర్లకు సహకరిస్తుంది. వారి స్వింగింగ్‌ బంతులకు వాలుతో కూడిన బలంతో బ్యాటర్లు తికమక పడతారు. శరీర స్థానం, క్రీజ్‌ లోకేషన్, పాదాల కదలికలు ఇలా ప్రతి అంశం బ్యాటర్‌ విజయం లేదా వైఫల్యాన్ని నిర్ణయించవచ్చు. ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌ టిమ్‌ ముర్తె "పెవిలియన్ ఎండ్‌ నుంచి బ్యాటర్లు త్వరగా ఔట్‌ కావడం చాలా సార్లు చూశాను" అని వ్యాఖ్యానించారు.

Details

 కెప్టెన్‌కు వ్యూహాత్మక సవాలు

భారత్‌ జట్టులో కొత్త ఆటగాళ్లకు లార్డ్స్‌ స్లోప్‌ కొత్త అనుభవమే. ఏ బౌలర్‌ను ఏ ఎండ్‌ నుంచి ఉపయోగించాలో నిర్ణయించడంలో కెప్టెన్‌కు స్పష్టత అవసరం. ఇందుకోసం 'అర్ష్‌దీప్‌ సింగ్‌' వంటి లెఫ్టార్మ్‌ పేసర్లను జట్టులోకి తీసుకోవాలని ఆలోచనలు జరుగుతున్నాయి. ఫీల్డింగ్‌లోనూ లార్డ్స్‌ స్లోప్‌ను దృష్టిలో ఉంచుకుని ప్లాన్ చేయాలి. ఒక వైపు బంతి వేగంగా పరుగు తీస్తుంది.

Details

 వికెట్‌ కీపర్‌కు అదనపు పని

ఎండ్‌ మారినప్పుడు వికెట్‌ కీపర్‌ తమ పొజిషన్‌ను మార్చుకోవాలి. వాలుతో కూడిన బంతి కదలిక వేగంగా ఉంటుంది. గాలి కూడా తోడైతే.. బైస్‌ రూపంలో పరుగులు పోవడం సహజం. కాబట్టి కీపర్లు ముందస్తుగా ఒక అడుగు కుడివైపు లేదా ఎడమవైపు జరిగి మైదానానికి అనుగుణంగా కదలాల్సిన అవసరం ఉంటుంది. లార్డ్స్‌ మైదానం నిర్మించక ముందు ఇది ఒక బాతుల కొలను. మేరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ ఏర్పాటు చేసినప్పుడు ప్రశాంతమైన ప్రాంతం కావాలనుకున్నారు. వ్యాపారవేత్త థామస్‌ లార్డ్‌కు సూచించిన ప్రాంతం ఇదే. మొదట మూడు మైదానాలుగా రూపొందించిన ఈ ప్రాంగణం.. ఇప్పుడో చారిత్రక క్రికెట్‌ స్థలంగా మారింది.