Page Loader
Shreyas Iyer: ఫైనల్ మ్యాచ్‌ ఓడిపోవాల్సింది కాదు.. శ్రేయస్ అయ్యర్ ఎమోషనల్ కామెంట్స్‌!
ఫైనల్ మ్యాచ్‌ ఓడిపోవాల్సింది కాదు.. శ్రేయస్ అయ్యర్ ఎమోషనల్ కామెంట్స్‌!

Shreyas Iyer: ఫైనల్ మ్యాచ్‌ ఓడిపోవాల్సింది కాదు.. శ్రేయస్ అయ్యర్ ఎమోషనల్ కామెంట్స్‌!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 04, 2025
02:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

2025 ఐపీఎల్‌ ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చరిత్ర సృష్టించింది. 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు చెక్ పెడుతూ తొలిసారిగా ఐపీఎల్ ట్రోఫీని తన ఖాతాలో వేసుకుంది. మంగళవారం రాత్రి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన హోరాహోరీ ఫైనల్‌ మ్యాచ్‌లో ఆర్సీబీ పంజాబ్ కింగ్స్‌ను 6 పరుగుల తేడాతో ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. అనంతరం ఛేజింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 184 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా ఆర్సీబీ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Details

 పంజాబ్ ఓటమిపై శ్రేయస్ అయ్యర్ స్పందన

ఫైనల్‌ ముగిసిన అనంతరం పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ, ''ఈ ఓటమి నన్ను తీవ్రంగా నిరాశపరిచింది. ఫైనల్లో ఓడినా మా యువ ఆటగాళ్లు గొప్పగా పోరాడారు. ఈ మ్యాచ్‌లో ఓడాల్సిన అవసరం లేదు. గత మ్యాచ్‌లో 200 పరుగుల లక్ష్యాన్ని తేలికగా చేధించాం. కానీ ఈ రోజు ఆర్సీబీ బౌలర్లు చాలా అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. ముఖ్యంగా కృనాల్ పాండ్యా తన అనుభవంతో మ్యాచ్ మలుపు తిప్పాడు. మా జట్టులో చాలామంది తమ తొలి ఐపీఎల్‌ సీజన్‌ ఆడినా, భయంలేని ఆట చూపారు. వచ్చే ఏడాది మళ్లీ టైటిల్ కోసం బరిలో దిగుతామని వ్యాఖ్యానించాడు.

Details

రాణించిన కృనాల్ పాండ్యా

ఫైనల్ మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ బాగా రాణించలేకపోయాడు. కేవలం 1 పరుగుతోనే పెవిలియన్‌కి చేరాడు. అయితే చివర్లో శశాంక బలంగా పోరాడాడు. 30 బంతుల్లో 61 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కానీ అది పంజాబ్ విజయానికి సరిపోలేదు. జోష్ ఇంగ్లిస్ 39 (23 బంతుల్లో), ప్రభ్ సిమ్రాన్ సింగ్ 26 (22 బంతుల్లో) పరుగులు చేశారు. ఆర్సీబీ బౌలింగ్‌లో కృనాల్ పాండ్యా మెరుపులు మెరిపించాడు. 4 ఓవర్లలో కేవలం 17 పరుగులే ఇచ్చి రెండు కీలక వికెట్లు తీశాడు. భువనేశ్వర్ కుమార్ రెండు వికెట్లు తీశాడు. దీంతో ఐపీఎల్‌ చరిత్రలో ఆర్సీబీ తొలిసారి టైటిల్‌ను గెలుచుకుంది. 2008 నుంచి ఇప్పటి వరకు మూడుసార్లు ఫైనల్‌ చేరినా 2025లో ఆ కల సాధించింది.