టీ20ల్లో ప్రపంచ చరిత్ర రికార్డు సృష్టించిన మలేషియా బౌలర్
అంతర్జాతీయ టీ20 క్రికెట్లో ప్రపంచ రికార్డు నమోదైంది. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ ఆసియా క్వాలిఫయర్- బి పోటీల్లో భాగంగా చైనాతో మలేషియా తలపడింది. ఈ మ్యాచులో మలేషియా బౌలర్ శ్యాజ్రుల్ ఇద్రుస్ ఏకంగా 7 వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించాడు. అతను పడగొట్టిన 7 వికెట్లు క్లీన్‌బౌల్డ్‌లే కావడం విశేషం. కేవలం నాలుగు ఓవర్లు వేసి 8 పరుగులిచ్చి 7 వికట్లను పడగొట్టాడు. ఇద్రుస్ దెబ్బకు చైనా 11.2 ఓవర్లలోనే 23 పరుగులు చేసి ఆలౌటైంది. చైనా బ్యాటర్లలో ఏకంగా ఆరుగురు బ్యాటర్లు డకౌట్ అయ్యారు. చైనా బ్యాటర్లలో అత్యధిక స్కోరు 7 పరుగులు కాగా.. ఎక్స్ ట్రాల రూపంలో 5 పరుగులు వచ్చాయి.
చైనాపై మలేషియా విజయం
24 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన మలేసియా 4.5 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. దీంతో మలేషియా 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. అంతర్జాతీయ టీ20ల్లో టాప్ 5 అత్యుత్తమ గణాంకాలు.. శ్యాజ్రుల్ ఇద్రుస్ (మలేసియా) (4-1-8-7) పీటర్ అహో (నైజీరియా) (3.4-1-5-6) దీపక్ చాహర్ (భారత్) (3.2-0-7-6) నక్రాని (ఉగాండ) (4-1-7-6) అజంతా మెండిస్ (శ్రీలంక) (4-2-8-6)