Manu Bhaker: ఖేల్ రత్న నామినేషన్ లో మను భాకర్ కి దక్కని చోటు..
పారిస్ ఒలింపిక్స్ 2024లో రెండు పతకాలు గెలుచుకుని భారత పతాకాన్ని గర్వంగా రెపరెపలాడించిన షూటర్ మను బాకర్ క్రీడా ప్రపంచంలో విశేషమైన ప్రస్థానాన్ని నమోదు చేసింది. వ్యక్తిగత విభాగంతో పాటు మిక్స్‌డ్ డబుల్స్‌లో పతకాలు సాధించడం ద్వారా, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. అయితే,తాజాగా ఖేల్ రత్న అవార్డుల నామినేషన్ల జాబితాలో ఆమెకు చోటు లేకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డు కోసం కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ సిద్ధం చేసిన జాబితాలో మను బాకర్ పేరు లేనట్టు వార్తలు వస్తున్నాయి,ఇది క్రీడాభిమానుల్లో నిరాశను కలిగించింది. ఇదే విషయంపై అధికారిక వర్గం స్పందిస్తూ,మనుబాకర్ దరఖాస్తు చేయలేదని పేర్కొంది.
షమీ దరఖాస్తు చేయకపోయినా..
అయితే, మను తండ్రి రామ్‌కిషన్ బాకర్ ఈ ప్రకటనను ఖండిస్తూ, తమ పిల్ల కోసం ఖేల్ రత్న అవార్డు కోసం దరఖాస్తు చేసిన విషయాన్ని స్పష్టం చేశారు. "ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలిచిన అథ్లెట్ కూడా పురస్కారం కోసం దరఖాస్తు చేయాలా? ఈ పరిస్థితులు అథ్లెట్లను ప్రోత్సహించే పద్ధతికి అనుకూలంగా లేవు," అని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, మహ్మద్ షమీ విషయాన్ని ప్రస్తావిస్తూ, ఆయన దరఖాస్తు చేయకున్నా అర్జున అవార్డు పొందిన ఉదాహరణను గుర్తుచేస్తూ, మను బాకర్ విషయంలో కూడా షూటింగ్ సమాఖ్య ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు,జాబితాలో హాకీ ప్లేయర్ హర్మన్‌ప్రీత్ సింగ్,పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్ వంటి ఇతర క్రీడాకారులు ఉన్నారని తెలుస్తోంది.