Mehidy Hasan Miraz: మ్యాచ్‌లో తలకు గాయం.. ఆస్పత్రిలో చేరిన బంగ్లాదేశ్ కెప్టెన్
ఈ వార్తాకథనం ఏంటి
ఆస్ట్రేలియాతో గురువారం ఢాకాలో జరిగిన రెండో వన్డే సందర్భంగా బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు కెప్టెన్ మెహిదీ హసన్ మిరాజ్ తలకు గాయపడడంతో ఆస్పత్రిలో చేరారు. ఆస్ట్రేలియా పేసర్ రైలీ మెరిడిత్ వేసిన బౌన్సర్ ఆయన హెల్మెట్‌ను బలంగా తాకింది. గాయం కారణంగా కొద్దిసేపు మైదానంలోనే చికిత్స పొందిన మిరాజ్, అనంతరం బ్యాటింగ్ కొనసాగించి జట్టును చారిత్రక విజయానికి చేర్చడం విశేషం.
వివరాలు
ఆ బౌన్సర్ వల్లే గాయం..
మ్యాచ్‌లో 34వ ఓవర్ నాలుగో బంతికి ఈ ఘటన చోటుచేసుకుంది. మెరిడిత్ వేసిన బౌన్సర్ మిరాజ్ హెల్మెట్ పక్క భాగాన్ని తాకడంతో ఆయన వెంటనే తలను పట్టుకుని మోకాళ్లపై కూర్చున్నారు. బంగ్లాదేశ్ జట్టు ఫిజియో బయ్జేదుల్ ఇస్లాం ఖాన్ మైదానంలోకి వచ్చి ఆయనను పరీక్షించారు. ఈ సమయంలో మిరాజ్ వాంతులు చేసుకున్నట్లు కనిపించడంతో ఆందోళన నెలకొంది. పరిస్థితిని పరిశీలించేందుకు ఆస్ట్రేలియా జట్టు వైద్యుడు కూడా మైదానంలోకి వచ్చారు. స్ట్రెచర్‌ను కూడా తీసుకొచ్చినప్పటికీ, మిరాజ్ తిరిగి లేచి నిలబడటంతో దాన్ని వెనక్కి పంపించారు.
వివరాలు
ఆస్పత్రికి తరలింపు..
మ్యాచ్ అనంతరం బంగ్లాదేశ్ జట్టు ఫిజియో బయ్జేదుల్ ఇస్లాం ఖాన్ మాట్లాడుతూ, మిరాజ్‌కు కన్‌కషన్ (తలకు బలమైన దెబ్బ తగలడం వల్ల కలిగే ప్రభావం) వచ్చినట్లు నిర్ధారించారు. "మైదానంలో పరీక్షించిన తర్వాత ఆయన ఆటను కొనసాగించారు. అయితే మరిన్ని లక్షణాలను పరిశీలించేందుకు, సాధారణ వైద్య పర్యవేక్షణ కోసం ఆస్పత్రికి పంపించాం. వచ్చే 24 గంటల పాటు ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉంటారు" అని తెలిపారు. తరువాత వచ్చిన సమాచారం ప్రకారం మిరాజ్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. అయితే పూర్తి స్థాయి పరిశీలన కోసం శుక్రవారం కూడా ఆస్పత్రిలోనే ఉండనున్నట్లు తెలుస్తోంది.
వివరాలు
గాయం అయినప్పటికీ బ్యాటింగ్ కొనసాగించిన మిరాజ్..
మిరాజ్ గాయపడటంతో మ్యాచ్ అనంతర ప్రెజెంటేషన్ కార్యక్రమంలో ఆయన స్థానంలో నజ్ముల్ హొసైన్ షాంటో పాల్గొన్నారు. మరోవైపు, గాయం అయినప్పటికీ బ్యాటింగ్ కొనసాగించిన మిరాజ్ ధైర్యసాహసాలను బంగ్లాదేశ్ పేసర్ టాస్కిన్ అహ్మద్ ప్రశంసించారు. "ఆ పరిస్థితిలో కూడా మిరాజ్ బ్యాటింగ్ చేయడం అద్భుతం. ఆ ఒత్తిడి సమయంలో ఆయన మైదానం వీడితే కొత్త బ్యాటర్ తప్పిదం చేసే అవకాశం ఉందని భావించి వెంటనే నిర్ణయం తీసుకున్నారని అనుకుంటున్నాను" అని టాస్కిన్ పేర్కొన్నారు.
వివరాలు
బంగ్లాదేశ్ ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం..
ఈ మ్యాచ్‌లో మిరాజ్ 22 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ఆయన ఇన్నింగ్స్‌తో బంగ్లాదేశ్ ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి వన్డేలో కూడా గెలిచిన బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాపై తమ చరిత్రలోనే తొలి వన్డే సిరీస్ విజయాన్ని నమోదు చేసింది. ఈ సిరీస్‌కు ముందు బంగ్లాదేశ్ ఆస్ట్రేలియాపై సాధించిన ఏకైక వన్డే విజయం 2005లో కార్డిఫ్‌లో జరిగిన ప్రసిద్ధ మ్యాచ్‌లోనే వచ్చింది. అంతేకాకుండా స్వదేశంలో ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్‌కు అప్పటివరకు ఒక్క వన్డే విజయం కూడా లేకపోవడం గమనార్హం.