FIFA World Cup 2026 Final: మెస్సీ-యమాల్ మెగా ఫైట్.. ప్రపంచకప్ ఫైనల్‌లో అర్జెంటీనా-స్పెయిన్ అమీతుమీ!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ ఫుట్ బాల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్‌కు సమయం ఆసన్నమైంది. డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా, యూరప్ విజేత స్పెయిన్ జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి. జూలై 20న అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలోని మెట్‌లైఫ్ స్టేడియం ఈ ప్రతిష్ఠాత్మక పోరుకు వేదిక కానుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ ప్రేమికుల చూపు ఈ మ్యాచ్‌పైనే నిలిచింది. ఇది కేవలం రెండు అగ్రశ్రేణి జట్ల మధ్య జరిగే ఫైనల్ మాత్రమే కాదు. రెండు విభిన్న తరాలకు చెందిన ఇద్దరు అసాధారణ ఆటగాళ్ల మధ్య ఆసక్తికర సమరంగా కూడా మారింది.
వివరాలు
మెస్సీకి మరో చరిత్ర సృష్టించే అవకాశం..
ఒకవైపు 39 ఏళ్ల దిగ్గజం లియోనెల్ మెస్సీ తన అద్భుత కెరీర్‌లో మరో ప్రపంచకప్ టైటిల్‌ను జోడించాలని లక్ష్యంగా పెట్టుకోగా, మరోవైపు 19 ఏళ్ల యువ సంచలనం లామిన్ యమాల్ తన ప్రతిభతో కొత్త శకానికి శ్రీకారం చుట్టాలని ఉవ్విళ్లూరుతున్నాడు.
దీంతో ఈ ఫైనల్ అనుభవానికి, యువశక్తికి మధ్య జరిగే ప్రతిష్ఠాత్మక పోరుగా మారింది.
అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ ఇప్పటికే తన దేశానికి ప్రపంచకప్‌తో పాటు కోపా అమెరికా వంటి అత్యంత ప్రతిష్ఠాత్మక టైటిళ్లను అందించాడు.
ఇప్పుడు వరుసగా రెండోసారి ప్రపంచకప్‌ను గెలిపించి అరుదైన ఘనతను అందుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతున్నాడు.
అర్జెంటీనా ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే, ప్రపంచకప్ టైటిల్‌ను విజయవంతంగా నిలబెట్టుకున్న కొద్ది జట్ల సరసన చోటు దక్కించుకోనుంది.
వివరాలు
యమాల్‌తో స్పెయిన్‌కు కొత్త స్వర్ణయుగమా?
స్పెయిన్‌కు చెందిన యువ స్టార్ లామిన్ యమాల్ తన తొలి ప్రపంచకప్ టోర్నీలోనే చరిత్ర సృష్టించే అవకాశాన్ని అందిపుచ్చుకునే ప్రయత్నంలో ఉన్నాడు.
ఇప్పటికే యూరో కప్‌లో తన అసాధారణ ప్రతిభను చాటుకున్న ఈ యువ ఆటగాడు, ఇప్పుడు ప్రపంచకప్ ట్రోఫీని కూడా ముద్దాడాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.
2010 తర్వాత మరోసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలవాలన్న సంకల్పంతో స్పెయిన్ జట్టు ఈ ఫైనల్‌లో అడుగుపెడుతోంది.