LOADING...
India vs England: మిడిల్‌ ఆర్డర్‌ లోపం, అనుభవం లేమి.. ఇంగ్లండ్‌లో భారత్‌కు కఠిన పరీక్షలు!
మిడిల్‌ ఆర్డర్‌ లోపం, అనుభవం లేమి.. ఇంగ్లండ్‌లో భారత్‌కు కఠిన పరీక్షలు!

India vs England: మిడిల్‌ ఆర్డర్‌ లోపం, అనుభవం లేమి.. ఇంగ్లండ్‌లో భారత్‌కు కఠిన పరీక్షలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 09, 2025
11:24 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇంగ్లండ్ పర్యటనకు సిద్ధమవుతున్న భారత జట్టుపై క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఐదు టెస్టుల సుదీర్ఘ సిరీస్‌తో వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ 2025-27 సైకిల్‌ ప్రారంభం కానుండటంతో భారత జట్టు సన్నద్ధతపై అన్ని చూపులూ ఉన్నాయి. పేస్ పిచ్‌లు, బజ్‌బాల్ ఆటతీరు కలిసిన ఇంగ్లాండ్ బలంగా కనిపిస్తుండగా.. యువకులతో భారత జట్టు తలపడనుంది. అయితే ఇందులో పలువురు ప్రశ్నార్ధక చిహ్నాల్లా మారుతున్నారు.

Details

 మి'డల్‌' ఆర్డర్‌లో గందరగోళం!

ప్రస్తుత జట్టులో శుభ్‌మన్‌ గిల్‌, యశస్వి జైస్వాల్‌, కేఎల్‌ రాహుల్‌, సాయి సుదర్శన్‌, అభిమన్యు ఈశ్వరన్‌, కరుణ్‌ నాయర్‌ లాంటి ఆరుగురు ఓపెనర్లు ఉండటం గమనార్హం. ఫలితంగా మిడిల్ ఆర్డర్ పటిష్టంగా లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గిల్‌ ప్రస్తుతం మూడో స్థానంలో బ్యాటింగ్‌ చేస్తున్నా.. ఆ స్థాయిలో ఇంకా స్థిరత కనబర్చలేకపోతున్నారు. పంత్‌, ధ్రువ్ జురేల్‌, జడేజా లాంటి ఆటగాళ్లు ఉన్నా.. శ్రేయస్ అయ్యర్ లాంటి మిడిల్ ఆర్డర్ స్పెషలిస్ట్‌ని ఎంపిక చేసి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం ఉందీ.

Details

అనుభవంలేని జట్టు!

శుభ్‌మన్‌గిల్‌ కెప్టెన్‌గా అనుభవం లేకపోవడం, టెస్టుల్లో విదేశీ పిచ్‌లపై అతని ఆటలో స్థిరత లేనిదీ ప్రధాన సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో పుజారా, రహానే లాంటి సీనియర్లు జట్టులో ఉంటారని అనుకున్నారు కానీ సెలక్టర్లు యువత వైపే మొగ్గుచూపారు. ప్రస్తుతం జడేజా ఒక్కడే ఫుల్ టైం సీనియర్. బుమ్రా పూర్తి సిరీస్‌లో అందుబాటులో ఉండే అవకాశం లేదు. కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్‌, సాయి సుదర్శన్‌ లాంటి ఆటగాళ్లు కొంత అనుభవం ఉన్నప్పటికీ అది చాలదనే వాదన ఉంది.

Details

ఇంగ్లాండ్ దాడిని తట్టుకోవచ్చా?

ఇంగ్లండ్‌ బౌలర్లు స్వింగ్‌తో భారత్‌ యువ బ్యాటర్లను బెంబేలెత్తించే అవకాశం ఉంది. అలాగే బజ్‌బాల్‌తో వారు భారీ స్కోర్లు చేసి మానసిక ఒత్తిడిలో నెట్టే ప్రమాదమూ ఉంది. బుమ్రా, షమీ ఫిట్‌నెస్‌ సమస్యలతో పూర్తి సిరీస్ ఆడలేని అవకాశమున్నా, సిరాజ్‌, శార్దూల్‌, ప్రసిద్ధ్‌, ఆకాశ్‌ దీప్‌ల ప్రతిభ కీలకం కానుంది. స్పిన్నర్లలో కుల్దీప్‌, వాషింగ్టన్‌ వేదికకు తగినట్టు ప్రభావం చూపగలరా? అనే అనుమానాలు ఉన్నాయి. జడేజా ఆల్రౌండ్‌ ఫార్మ్‌ కూడ చర్చనీయాంశమే.

Details

బజ్‌బాల్‌కు బదులుగా అదే జోరు?

ఇటీవలి భారత్‌-ఇంగ్లాండ్ సిరీస్‌లో జైస్వాల్‌, పంత్‌ లాంటి ఆటగాళ్లు బజ్‌బాల్ స్టైల్‌లోనే ఆడి ఇంగ్లాండ్‌ను ఒత్తిడిలోకి నెట్టారు. ఇప్పుడు అదే జోరు కొనసాగితే భారత్‌కు భారీ పాయింట్ అవుతుందనడంలో సందేహం లేదు. సిరాజ్‌కు ఆసీస్ పర్యటనలో బౌలింగ్‌ను ముందుండి నడిపించిన అనుభవం ఉంది. ఇప్పుడూ బుమ్రా లేకపోతే అతనిపైనే ఆశలు.

Details

యువ శక్తిపైనే నమ్మకం!

జట్టులో సీనియారిటీ లోటు, మిడిల్ ఆర్డర్ లోపం ఉన్నా.. సెలక్టర్లు యువ శక్తిపైనే దృష్టి పెట్టారు. ఈ విశ్వాసం సిరీస్‌ను ఆసక్తికరంగా మార్చుతోంది. ఫలితాలపై సమాధానం జూన్‌ 20 నుంచి లీడ్స్‌ టెస్టుతో ప్రారంభమవుతుందంటే.. భారత క్రికెట్‌ అభిమానులకు ఎదురు చూపే ప్రారంభమైంది.