Mohammed Shami: మహ్మద్ షమీని తక్కువ అంచనా వేయలేం.. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ప్రశంసలు
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో టీమిండియా పేసర్ మహ్మద్ షమీ (Mohammed Shami) అంచనాలకు మించి రాణిస్తున్నాడు. ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచులో నాలుగు వికెట్లు పడగొట్టి, భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇక న్యూజిలాండ్ మ్యాచుతో బరిలోకి దిగిన షమీ ఐదు వికెట్లు తీసి తనెంత విలువైన ఆటగాడినో తన ప్రదర్శనతో నిరూపించుకున్నాడు. ఈ నేపథ్యంలో మహ్మద్ షమీపై ఇంగ్లండ్ మాజీ పేసర్ స్టీవ్ హర్మిసన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రపంచ క్రికెట్‌లో మహ్మద్ షమీని అత్యంత తక్కువగా అంచనా వేశారని, నాణ్యమైన ఫాస్ట్ బౌలర్లలో షమీ కూడా ఒక్కరిని స్టీవ్ హర్మిసన్ కొనియాడారు.
రేపు శ్రీలంకతో తలపడనున్న భారత్
మరోవైపు జస్ప్రిత్ బుమ్రా కూడా అద్భుతంగా రాణిస్తున్నాడని, ఆఫ్ స్టంప్ మధ్య బ్యాటర్లు ఇబ్బంది పెడుతూ వికెట్లు తీస్తున్నాడని స్టీవ్ హర్మిసన్ చెప్పారు. ఈ టోర్నీలో భాగంగా రేపు ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్, శ్రీలంకతో తలపడనుంది. ప్రస్తుతం టీమిండియా 6 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఇక వన్డే ప్రపంచ కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో షమీ 11వ స్థానంలో ఉన్నాడు. షమీ మరో రెండు వికెట్లు పడగొడితే బాంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్‌ను అధిగమిస్తాడు.