Loading...
Mohammed Shami: 13 ఏళ్ల టెస్టు ప్రయాణానికి గుడ్‌బై చెప్పిన షమీ
13 ఏళ్ల టెస్టు ప్రయాణానికి గుడ్‌బై చెప్పిన షమీ

Mohammed Shami: 13 ఏళ్ల టెస్టు ప్రయాణానికి గుడ్‌బై చెప్పిన షమీ

వ్రాసిన వారు Balachander Sharma
Nov 07, 2026
10:46 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత స్టార్ పేసర్ మహమ్మద్ షమీ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. శుక్రవారం సోషల్ మీడియా ద్వారా తన నిర్ణయాన్ని ప్రకటించిన షమీ.. సరిగ్గా 13 ఏళ్ల క్రితం టెస్టుల్లో అడుగుపెట్టిన రోజునే సుదీర్ఘ ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పడం విశేషం. అయితే క్రికెట్‌కు మాత్రం పూర్తిగా దూరం కావడం లేదు. వన్డేలు, టీ20లు, ఐపీఎల్‌తో పాటు దేశవాళీ క్రికెట్‌లోనూ కొనసాగనున్నట్లు స్పష్టం చేశాడు. 2013లో వెస్టిండీస్‌తో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో అరంగేట్రం చేసిన షమీ.. తొలి మ్యాచ్‌లోనే రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 9 వికెట్లు తీసి తన రాకను ఘనంగా చాటాడు. అదే ఇప్పటికీ అతని టెస్ట్ కెరీర్‌లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనగా నిలిచింది.

Details

రివర్స్ స్వింగ్‌తో ప్రత్యేక గుర్తింపు

షమీ పేరు వినగానే చాలామంది అభిమానులకు గుర్తొచ్చేది అతని రివర్స్ స్వింగ్.

పాత బంతితోనూ బ్యాటర్లను ఇబ్బంది పెట్టే అతని నైపుణ్యం.. ముఖ్యంగా ఉపఖండం బయట జరిగిన మ్యాచ్‌ల్లో భారత్‌కు ఎన్నోసార్లు ఉపయోగపడింది.

64 టెస్టుల్లో 229 వికెట్లు తీసిన షమీ.. 27.71 బౌలింగ్ సగటు, 50.2 స్ట్రైక్ రేట్‌తో తన టెస్ట్ కెరీర్‌ను ముగించాడు.

ఆరు సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించాడు. భారత గడ్డపై అతని బౌలింగ్ మరింత పదునుగా ఉండేది.

స్వదేశంలో 22.1 సగటుతో వికెట్లు పడగొట్టిన షమీ.. సగటున ప్రతి 42.6 బంతులకు ఒక వికెట్ సాధించాడు. విదేశాల్లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ పర్యటనల్లోనూ కీలక స్పెల్స్ వేశాడు.

Details

గాయాల మధ్య కూడా వెనక్కి తగ్గలేదు

షమీ కెరీర్ మొత్తం చూస్తే కేవలం గణాంకాలు మాత్రమే కనిపించవు. గాయాలు, ఫిట్‌నెస్ సమస్యలు, జట్టులోకి తిరిగి రావడానికి చేసిన పోరాటం కూడా కనిపిస్తాయి.

ఎన్నోసార్లు శరీరం సహకరించకపోయినా.. భారత జట్టుకు అవసరమైన సమయంలో తిరిగి మైదానంలోకి వచ్చాడు.

2023లో ఆస్ట్రేలియాతో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ అతని చివరి టెస్ట్ మ్యాచ్‌గా నిలిచింది. ఆ తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్‌పై దృష్టి పెట్టిన షమీ.. ఇప్పుడు టెస్ట్‌లకు అధికారికంగా ముగింపు పలికాడు.

అయితే బెంగాల్ తరఫున దేశవాళీ క్రికెట్ ఆడటంతో పాటు ఐపీఎల్‌లోనూ కొనసాగనున్నాడు. ప్రస్తుతం లక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

ADVERTISEMENT

Details

అభిమానులకు షమీ ప్రత్యేక ధన్యవాదాలు

రిటైర్మెంట్ ప్రకటనలో షమీ తన 13 ఏళ్ల టెస్ట్ ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నాడు.

కోచ్‌లు, ట్రైనర్లు, ఫిజియోలు, సహచరులు, కుటుంబ సభ్యులతో పాటు తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపాడు.

ముఖ్యంగా అభిమానులు ఇచ్చిన ప్రేమను ప్రత్యేకంగా గుర్తుచేసుకున్నాడు. టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకున్నప్పటికీ.. బంతి చేతిలో ఉన్నంతకాలం షమీని మైదానంలో చూడొచ్చు.

229 టెస్ట్ వికెట్లతో ముగిసిన ఈ ప్రయాణం భారత క్రికెట్‌లో అతనికంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది.

రివర్స్ స్వింగ్‌తో బ్యాటర్లను వణికించిన షమీ ఇక టెస్టుల్లో కనిపించకపోయినా.. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అతని బౌలింగ్ కోసం అభిమానులు ఎదురు చూస్తుంటారనడంలో సందేహం లేదు.

ADVERTISEMENT