Page Loader
MS Dhoni Birthday: ధోనీ లాంటి కెప్టెన్ లేడు .. ఇక రాడు
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ

MS Dhoni Birthday: ధోనీ లాంటి కెప్టెన్ లేడు .. ఇక రాడు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 07, 2023
05:10 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత క్రికెట్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని సంపాదించుకున్నాడు. జార్ఖండ్ డైనమైట్‌గా ధోనీని అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారు. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పి మూడేళ్లు అవుతున్న అతని క్రేజ్ ఇసుమంతైనా తగ్గలేదు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 16వ సీజన్ చాలు ధోనీ క్రేజ్ ఏంటో చెప్పడానికి. సీఎస్‌కే‌ను ఐదోసారి ఛాంపియన్‌గా నిలవడంతో ఎంఎస్ ధోనీపై ప్రేమ అభిమానులకు ఆకాశమంత ఎత్తుకు వెళ్లిపోయింది. ఈ రోజు ధోనీ తన 42 పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు. ఫ్యాన్స్ ధోనీకి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ధోనీ పుట్టిన రోజు సందర్భంగా ధోనీ గురించి ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.

Details

కెప్టెన్ గా చెరిగిపోలేని ముద్ర

టీమిండియా కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ చెరిగిపోని ముద్ర వేశాడు. ఒకరకంగా ధోనీకి ముందు ధోనీ తర్వాత అనేంతగా టీమిండియాపై ధోనీ ప్రభావం ఉంది. మైదానంలో ధోనీ నాయకత్వ లక్షణాలు, ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా కూల్‌గా వ్యవహరించే తీరు కెప్టెన్‌గా ధోనీని ప్రత్యేకంగా నిలిపాయి. కీపర్‌గా, బ్యాటర్‌గా, కెప్టెన్‌గా ధోనీ ఆ బాధ్యతలకే వన్నె తెచ్చాడంటే అతిశయోక్తి కాదు. ధోని ఇప్పటివరకూ 3 ఐసీసీ ట్రోఫీలతో పాటు ఐదు ఐపీఎల్ టైటిల్స్, 2 ఛాంపియన్స్ లీగ్ టీ20 ట్రోఫీలు, టెస్టు ర్యాంకిగ్స్ లో నంబర్ వన్ పొజిషన్‌కు టీమిండియాకు చేర్చిన ఘనత ధోని సొంతం చేసుకున్నాడు. అదేవిధంగా వన్డే క్రికెట్లో 10వేల పరుగులు సాధించి, భారత క్రికెట్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన పేజీని లిఖించుకున్నాడు.

Details

2020లో రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ

2011 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచులో శ్రీలంకపై ధోని బాదిన విన్నింగ్ సిక్సర్ క్రికెట్ ఫ్యాన్స్ ఇప్పటికీ మరిచిపోలేరు. ఒకరకంగా చెప్పాలంటే నాయకుడిగా ధోని గురించి ఎంత చెప్పినా తక్కువే. 2007లో టీ20 వరల్డ్ కప్, 2011లో వన్డే వరల్డ్ కప్, 2013లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సాధించి పెట్టారు. ఆగస్టు 15, 2020న ధోనీ ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఎంఎస్ ధోనీ టీమిండియా తరుపున 350 వన్డేలు, 90 టెస్టులు, 98 టీ20లు ఆడాడు. వన్డేల్లో 10 సెంచరీలు, టెస్టుల్లో 6 సెంచరీలను బాదాడు. ఇక ఐపీఎల్‌లో 250 మ్యాచులు ఆడి 5082 పరుగులు చేశాడు.

Details

తెలుగు రాష్ట్రాల్లో ధోనీకి కటౌట్లు

ఎంఎస్ ధోనీ 2010లో సాక్షిని పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం అతనికి కుమార్తె జీవా కూడా ఉంది. ప్రస్తుతం జీవాకు ఏడేళ్లు. అయితే జీవాకి ఇన్ స్టాలో ఆకౌంట్ ఉంది. ఇప్పటికే ఆకౌంట్ కి 2 మిలియన్ల పైగా ఫాలోవర్లు కూడా ఉన్నారు. ధోని, సాక్షి సింగ్ తమ 13వ వివాహా వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న సందర్భంగా ధోనీకి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. దేశ వ్యాప్తంగా అతని అభిమానులు పుట్టిన రోజు వేడుకులను ఘనంగా జరపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ధోనికి పెద్ద ఎత్తున కటౌట్లు ఏర్పాటు చేశారు.