MS Dhoni: రూ. 15 కోట్ల నష్టం.. మాజీ వ్యాపార భాగస్వాములపై కేసు పెట్టిన ధోనీ
ఆర్కా స్పోర్ట్స్ అండ్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్‌కు చెందిన మిహిర్ దివాకర్,సౌమ్య విశ్వాష్‌లపై క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోని రాంచీ కోర్టులో క్రిమినల్ కేసు దాఖలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అకాడమీని నెలకొల్పేందుకు దివాకర్ 2017లో ధోనితో ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే, ఒప్పందంలో పేర్కొన్న షరతులను పాటించడంలో దివాకర్ విఫలమయ్యారు. అంతేకాదు ఒప్పందం నిబంధనల ప్రకారం ఆర్కా స్పోర్ట్స్ ఫ్రాంచైజీ రుసుము, వాటా ఆదాయాన్ని చెల్లించాలి. అయితే, వాటిని చెల్లించలేదు. అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ, ఒప్పందంలో పేర్కొన్న నిబంధనలు,షరతులను ఆర్కా స్పోర్ట్స్ అండ్ మేనేజ్‌మెంట్ విస్మరించింది. పర్యవసానంగా, ధోని ఆగస్ట్ 15, 2021న ఆర్కా స్పోర్ట్స్‌కు మంజూరు చేసిన అధికార లేఖను ఉపసంహరించుకున్నారు.
మిహిర్ దివాకర్ పై సిమంత్ లోహానీ ఫిర్యాదు
అనంతరం మిహిర్ దివాకర్, సౌమ్య విశ్వాష్ కు చట్టపరంగా నోటీసులను పంపినా.. ప్రయోజనం లేకుండా పోయింది. విధి అసోసియేట్స్ కి ప్రాతినిధ్యం వహిస్తున్న దయానంద్ సింగ్, ఆర్కా స్పోర్ట్స్ తమను రూ.15 కోట్ల మేర నష్టపరిచిందని తెలిపారు. ఆర్కా స్పోర్ట్స్‌పై చట్టపరమైన చర్యలు తీసుకున్న తర్వాత మిహిర్ దివాకర్ తనను బెదిరించి, దుర్భాషలాడాడని ఆరోపిస్తూ ధోనీ స్నేహితుడు చిట్టుగా ప్రసిద్ధి చెందిన సిమంత్ లోహానీ కూడా ఫిర్యాదు చేశాడు. ఎంఎస్ ధోని ఇటీవలే తన నూతన సంవత్సరాన్ని దుబాయ్‌లో గడిపిన తర్వాత ఇంటికి తిరిగి వచ్చాడు. ఈ పర్యటనలో ధోనీతో పాటు భారత వికెట్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్ కూడా ఉన్నాడు. ధోనీ తన స్నేహితులు,కుటుంబ సభ్యులతో కలిసి దుబాయ్‌లో క్రిస్మస్ జరుపుకున్నాడు.