T20 Wold Cup 2026: వరల్డ్‌కప్ గెలిచిన భారత్‌కు క్రికెట్ దిగ్గజాల ప్రశంసలు
ఈ వార్తాకథనం ఏంటి
టీ20 ప్రపంచకప్-2026ను టీమ్‌ఇండియా కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 96 పరుగుల భారీ తేడాతో భారత్ విజయం సాధించింది. ఈ విజయంపై పలువురు ప్రముఖ క్రికెటర్లు స్పందిస్తూ భారత జట్టుకు అభినందనలు తెలిపారు. టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్. ధోని కోచ్ గౌతమ్ గంభీర్‌పై ప్రశంసలు కురిపించాడు. కోచ్ సాబ్ ముఖంపై కనిపించే చిరునవ్వు ఎంతో బాగుంటుందని చెప్పాడు. విజయం సాధించాలనే ఆయన పట్టుదల, ముఖంపై చిరునవ్వు కలిసొస్తే అది కిల్లర్ కాంబినేషన్‌లా పనిచేస్తుందని వ్యాఖ్యానించాడు. అలాగే జస్ప్రీత్ బుమ్రాను నిజమైన ఛాంపియన్ బౌలర్‌గా అభివర్ణిస్తూ.. అతడి విజయాలను ఒక్క మాటలో చెప్పడం సాధ్యం కాదని తెలిపాడు.
వివరాలు
ట్రోఫీని గెలుచుకోవడానికి భారత క్రికెటర్లు పూర్తిగా అర్హులు: గవాస్కర్
టీ20 ప్రపంచకప్‌లో సాధారణంగా 25 నుంచి 30 పరుగుల తేడాతో గెలిచినా అది పెద్ద విజయంగా భావిస్తామని మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ పేర్కొన్నారు. కానీ ఈసారి భారత్ సాధించిన విజయం దానికంటే మరింత భారీదని చెప్పారు. టీ20 ఫార్మాట్‌లో ఒకే జట్టు వరుసగా రెండుసార్లు ప్రపంచకప్ గెలుచుకోవడం ఇదే మొదటిసారి అని సచిన్ టెండూల్కర్ అన్నారు. ఈ ట్రోఫీని గెలుచుకోవడానికి భారత క్రికెటర్లు పూర్తిగా అర్హులని ఆయన అభిప్రాయపడ్డారు. అద్భుతమైన ప్రదర్శనతో క్రికెట్‌లో టీమ్‌ఇండియా ఎప్పటికీ ఒక ప్రత్యేకమైన బ్రాండ్‌గా నిలుస్తుందని వ్యాఖ్యానించారు.
వివరాలు
జట్టులోని ప్రతి ఆటగాడు అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించారు: రోహిత్
భారత జట్టులోని ప్రతి ఆటగాడు అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించారని రోహిత్ శర్మ అభినందనలు తెలిపారు. మరోసారి ప్రపంచ ఛాంపియన్లుగా నిలవడం ఎంతో గర్వకారణమని విరాట్ కోహ్లీ అన్నారు. అహ్మదాబాద్‌లో జరిగిన ఈ భారీ ఫైనల్‌లో భారత్ అద్భుతమైన విజయం సాధించిందని చెప్పారు. టోర్నమెంట్ మొత్తం ఒత్తిడిలో ఉన్నప్పటికీ జట్టు ఆటగాళ్లు తమ సామర్థ్యాన్ని నిరూపించారని తెలిపారు. సంజు అత్యుత్తమ ఆటతీరుతో ఆకట్టుకున్నాడని కొనియాడారు. ఇంత ప్రతిభ కలిగిన ఆటగాళ్లతో ఇతర జట్లు సరితూగడం కష్టమని పేర్కొన్నారు. ఈ గొప్ప విజయానికి తోడ్పడిన మేనేజ్‌మెంట్, సపోర్ట్ స్టాఫ్ సభ్యులందరికీ ఆయన అభినందనలు తెలిపారు.
వివరాలు
గల్లీ క్రికెట్ ఆడినంత ఈజీగా మ్యాచ్‌ను ముగించారు: సెహ్వాగ్
ఒత్తిడి అంటే ఏమిటో తెలియనట్టుగా మన ఆటగాళ్లు ఆదివారం మ్యాచ్‌ను ఎంతో సులభంగా పూర్తి చేశారని వీరేంద్ర సెహ్వాగ్ వ్యాఖ్యానించారు. గల్లీ క్రికెట్ ఆడినంత ఈజీగా మ్యాచ్‌ను ముగించారని చెప్పారు.మరోసారి ప్రపంచ ఛాంపియన్లుగా భారత్ నిలిచిందని, టీ20 ప్రపంచకప్‌లలో ఇది భారత్‌కు మూడో టైటిల్ అని గుర్తు చేశారు. ఈ విజయం నమ్మకం,వ్యక్తిత్వం,జట్టు సమిష్టి కృషికి నిదర్శనమని వీవీఎస్ లక్ష్మణ్ తెలిపారు. మ్యాచ్ సమయంలో జట్టు ఒత్తిడిని ఎదుర్కొన్న తీరు,కీలకమైన సందర్భాలను సద్వినియోగం చేసుకున్న విధానం ప్రత్యేకంగా నిలిచిందని అన్నారు. ఇలాంటి విజయాలు దేశవ్యాప్తంగా లక్షలాది మంది యువ క్రికెటర్లకు పెద్ద కలలు కనడానికి ప్రేరణగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఈ అద్భుత విజయాన్ని సాధించిన భారత జట్టుకు ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.