Ms Dhoni Case: 15 కోట్ల మోసం కేసులో మహేంద్ర సింగ్ ధోని మాజీ వ్యాపార భాగస్వామి మిహిర్ దివాకర్ అరెస్ట్
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి వ్యాపార భాగస్వామిగా ఉన్న మిహిర్ దివాకర్ అరెస్టయ్యాడు. 15 కోట్ల మోసం చేశారంటూ మిహిర్‌పై ధోనీ క్రిమినల్ కేసు పెట్టారు. ధోనీ ఫిర్యాదు మేరకు మిహిర్‌పై ఐపీసీ 406, 420, 467, 468, 471, 120బి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రాంచీ జిల్లా కోర్టులో ఆర్కా స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్‌పై ఈ ఫిర్యాదు దాఖలైంది. మిహిర్ దివాకర్, అతని భార్య సౌమ్య దాస్ ఈ కంపెనీకి డైరెక్టర్లుగా ఉన్నారు. మిహిర్‌ను జైపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎంఎస్ ధోని పేరును దుర్వినియోగం చేసి జైపూర్‌లో క్రికెట్ అకాడమీని ప్రారంభించినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి.
అసలు ఏమి జరిగిందంటే?
జైపూర్ పోలీస్ కమీషనర్ బిజు జార్జ్ జోసెఫ్ తెలిపిన వివరాల ప్రకారం, జైపూర్‌లోని గాంధీ పంత్ ప్రాంతంలో ఎంఎస్ ధోని పేరిట క్రికెట్ అకాడమీని ప్రారంభించడంలో అవకతవకలకు సంబంధించిన ఆరోపణలపై దివాకర్‌పై కేసు నమోదైంది. మిహిర్ దివాకర్ 2017లో క్రికెట్ అకాడమీని ప్రారంభించేందుకు మహేంద్ర సింగ్ ధోనీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. కానీ అగ్రిమెంట్ లో పేర్కొన్న షరతులను దివాకర్ పాటించలేదు. ఈ కేసులో ఆర్కా స్పోర్ట్స్ ఫ్రాంచైజీ ఫీజు చెల్లించాల్సి వచ్చింది. ఒప్పందం ప్రకారం, లాభం పంచుకోవాలి, కానీ ఒప్పందంలోని అన్ని నిబంధనలు, షరతులు ఉల్లంఘించారు.
ధోనీ పేరుతో దాదాపు రూ.15 కోట్ల మోసం
దీని తర్వాత ధోనీ మిహిర్, అతని కంపెనీ నుండి అన్ని హక్కులను లాగేసుకున్నాడు. కానీ దీని తర్వాత కూడా, మిహిర్ ధోని పేరును ఉపయోగించాడు. దేశ ,విదేశాలలో అనేక క్రికెట్ అకాడమీలను ప్రారంభించాడు. ఎంఎస్ ధోని క్రికెట్ అకాడమీ, ఎంఎస్ ధోనీ స్పోర్ట్స్ అకాడమీ కోసం డబ్బు తీసుకుని ధోనీని మోసం చేశాడని మిహిర్‌పై ఆరోపణలు వచ్చాయి. ఈ విధంగా ధోనీ పేరుతో దాదాపు రూ.15 కోట్ల మోసం జరిగింది. ఈ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత, మేధో సంపత్తి హక్కులు (IPR) గురించి చర్చ మళ్లీ తీవ్రమైంది. వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఏదైనా ప్రముఖుడి పేరును దుర్వినియోగం చేస్తే చట్టపరమైన పరిణామాలను ఎదుర్కొవలిసి ఉంటుంది.