IND vs NZ 3rd Test: ముంబై టెస్టు పిచ్ రిపోర్ట్.. ఎవరికి అనుకూలంగా ఉందంటే?
భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్ చివరి మ్యాచ్ నవంబర్ 1న ముంబైలోని వాంఖడే స్టేడియంలో ప్రారంభం కానుంది. సిరీస్‌లో ఇప్పటికే 2-0 ఆధిక్యంతో ఉన్న న్యూజిలాండ్, క్లీన్ స్వీప్ చేసి తహతహలాడుతోంది. మరోవైపు సిరీస్‌లో పరువు నిలబెట్టుకోవడానికి భారత్ చివరి మ్యాచ్‌లో విజయం సాధించాలని పట్టుదలగా ఉంది. ఈ మ్యాచ్‌కు సంబంధించి పిచ్ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటి రోజు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండనుంది. రెండవ రోజు నుంచి స్పిన్నర్లు విజృంభించే అవకాశం ఉందని క్యూరేటర్లు పేర్కొన్నారు.
పిచ్ ను సమీక్షించిన బీసీసీఐ చీఫ్
బీసీసీఐ చీఫ్ పిచ్ క్యూరేటర్ ఆశిష్ భౌమిక్, ఎలైట్ ప్యానెల్ క్యూరేటర్ తపోష్ ఛటర్జీ, వాంఖడే స్టేడియం క్యూరేటర్ రమేష్ మముంకర్ పిచ్‌ను సమీక్షించి, ఇది స్పోర్టింగ్ ట్రాక్ అవుతుందని తెలిపారు. 2021 డిసెంబర్‌లో ఇరు జట్లు చివరిసారిగా వాంఖడేలో తలపడగా, ఆ మ్యాచ్‌లో భారత్ 372 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో మొదటి రోజు నుంచే పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉండగా, అజాజ్ పటేల్ 10 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. భారత బౌలర్ అశ్విన్ 42 పరుగులిచ్చి 8 వికెట్లు సాధించి కీలక పాత్ర పోషించాడు. ఈ చివరి టెస్టు మ్యాచ్ ను ఇరు జట్లకు ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్నారు.