పది రోజులగా మా నాన్న ఐసీయూలో ఉన్నాడు.. ఈ విజయం ఆయనకే అంకితం: లక్నో పేసర్
ఐపీఎల్‌లో లక్నో పేసర్ మోసిన్ ఖాన్ ఒక్క ఓవర్ తోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. అటల్ బిహారి వాజ్ పేయి స్టేడియం వేదికగా ముంబైతో జరిగిన మ్యాచులో లక్నో సూపర్ జెయింట్స్ 5 పరుగుల తేడాతో గెలుపొందింది. ఆ జట్టు విజయంలో లక్నో పేసర్ మోసిన్ ఖాన్ కీలక పాత్ర పోషించాడు. చివరి ఓవర్లో ముంబై విజయానికి 11 పరుగులు అవసరం అయ్యాయి. ఇక లక్నో ఓడిపోతుందని అందరూ ఓ అంచనాకు వచ్చేశారు. కానీ అఖరి వేసిన మోసిన్ ఖాన్ అద్భుతమే చేశాడు. తీవ్ర ఒత్తిడిలో బుల్లెట్ లాంటి బంతులు వేసి.. గ్రీన్, టిమ్ డేవిడ్ లకు చెక్ పెట్టాడు. ఆరు బంతుల్లో ఐదు పరుగులిచ్చి లక్నో కు విజయాన్ని అందించాడు.
లక్నోకి విజయాన్ని అందించిన మోసిన్ ఖాన్
మ్యాచ్ అనంతరం మోసీన్ ఖాన్ మాట్లాడుతూ మ్యాచ్ కు ముందు పది రోజులుగా తన తండ్రి ఐసీయూలో ఉన్నాడని, అయినా ఆ బాధను దిగమింగుతూ చివరి ఓవర్ ను విజయవంతం పూర్తి చేశానని చెప్పారు. గాయం కారణంగా ఏడాది తర్వాత ఐపీఎల్ ఆడుతున్నానని, నాన్న నిన్ననే డిశ్చార్జ్ అయ్యారని, ఈ మ్యాచ్ ఆయన చూస్తున్నారన్న నమ్మకం ఉందన్నారు. అదే విధంగా తనపై నమ్మకంతో ఆఖరి ఓవర్ బౌలింగ్ వేయడానికి అవకాశం ఇచ్చిన సపోర్ట్ స్టాప్ కు మోసీన్ ఖాన్ ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ ఫ్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.