National Sports Day 2024: భారత ఆల్ టైమ్ గ్రేట్ ప్లేయర్.. మేజర్ ధ్యాన్ చంద్ రికార్డులు, విజయాలు పై కథనం
భారత హాకీ విషయానికి వస్తే, మొదటగా మనకు గుర్తుకు వచ్చే ఏకైక ఆటగాడు మేజర్ ధ్యాన్ చంద్ . అయన భారతదేశంలో హాకీ విజయంలో విప్లవాత్మక పాత్ర పోషించాడు. 1928, 1932, 1936లో మేజర్ ధ్యాన్‌చంద్ భారతదేశం తరపున ఒలింపిక్స్ ఆడారు. అందులో భారత్ మూడుసార్లు ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచింది. ఈ ఆటగాడి జన్మదినమైన ఆగస్టు 29న భారతదేశంలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇప్పుడు , అయన రికార్డులు,విజయాలు పై ఓ లుక్కేదాం.
ధ్యాన్ చంద్ ఇలా మొదలుపెట్టాడు
ధ్యాన్ చంద్ తన మొదటి ఆటలోనే అందరినీ ఆశ్చర్యపరిచాడు. 1925లో ఇంటర్-ప్రావిన్షియల్ టోర్నమెంట్ సమయంలో, అయన అప్పటి యునైటెడ్ ప్రావిన్సెస్ (UP) జట్టుకు ఎంపికయ్యాడు. అక్కడ అయన ఆట అందరి దృష్టిని ఆకర్షించింది. అయన తన సహచరులకు పాస్‌లను సులభంగా పాస్ చేసేవాడు. ఆయనకు గోల్స్ చేయగల అద్భుతమైన సామర్ధ్యం ఉంది. ఈ కారణంగా ఆయన 1928 ఒలింపిక్ జట్టులో చోటు సంపాదించాడు.
1928 ఒలింపిక్స్‌లో 14 గోల్స్
1928 ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు తొలిసారిగా బంగారు పతకం సాధించింది. మొత్తం టోర్నీలో ధ్యాన్‌చంద్ అద్భుత ప్రదర్శన చేశాడు. ఫైనల్లో, ధ్యాన్‌చంద్ నెదర్లాండ్స్ హాకీ జట్టుపై హ్యాట్రిక్ సాధించాడు. భారత్ సులభంగా బంగారు పతకాన్ని గెలుచుకుంది. అయన మొత్తం టోర్నమెంట్‌లో అత్యధికంగా 14 గోల్స్ చేశాడు. ఆ సమయంలో ధ్యాన్ చంద్ 'హాకీ మాంత్రికుడు' అని అయన గురించి ఓ వార్తాపత్రిక రాసింది.
కెప్టెన్సీలో భారత్‌కు బంగారు పతకాన్ని అందించాడు
అయన 2 ఒలింపిక్ బంగారు పతకాలను గెలుచుకున్న తర్వాత, అయన డిసెంబర్ 1934లో భారతదేశానికి కెప్టెన్‌గా నియమించబడ్డాడు. 2 సంవత్సరాల తరువాత అయన బెర్లిన్‌లో జరిగిన చివరి ఒలింపిక్స్‌లో జట్టుకు నాయకత్వం వహించాడు. జర్మనీ హాకీ జట్టుతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆ జట్టు 1-4 తేడాతో ఓడిపోయింది. అయితే దీని తర్వాత ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు అదే జర్మనీ జట్టుపై 8-1 తేడాతో విజయం సాధించింది. ఫైనల్లో ధ్యాన్ చంద్ 3 గోల్స్ చేశాడు.
ధ్యాన్‌చంద్‌ని జర్మనీ తరపున ఆడమని హిట్లర్ కోరినప్పుడు
జర్మనీపై అద్భుతమైన విజయం తర్వాత, అడాల్ఫ్ హిట్లర్ ధ్యాన్ చంద్‌ను విందుకు ఆహ్వానించాడు. జర్మనీ తరపున ఆడమని అడిగాడు. ప్రతిఫలంగా, అతనికి జర్మన్ ఆర్మీలో కల్నల్ పదవి కూడా ఇవ్వజూపాడు. దానికి ధ్యాన్‌చంద్, నేను భారతీయ సైనికుడిని అంటూ సున్నితంగా హిట్లర్ ఇచ్చిన ఆఫర్ ని తిరస్కరించాడు. భారత్ తరఫున 22 ఏళ్ల పాటు ఆడి 400 గోల్స్ చేశాడు. అయన ఇండియన్ ఆర్మీలో లాన్స్ నాయక్ హోదాను కూడా కలిగి ఉన్నాడు.