LOADING...
Neeraj Chopra: డైమండ్ లీగ్ ఫైనల్లో భారత జావెలిన్ స్టార్ నీరజ్‌కు రెండో స్థానం.. టైటిల్ చేజారినా రికార్డు పదిలం
టైటిల్ చేజారినా రికార్డు పదిలం

Neeraj Chopra: డైమండ్ లీగ్ ఫైనల్లో భారత జావెలిన్ స్టార్ నీరజ్‌కు రెండో స్థానం.. టైటిల్ చేజారినా రికార్డు పదిలం

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 29, 2025
08:15 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత జావెలిన్ త్రో స్టార్, ప్రపంచ చాంపియన్ నీరజ్ చోప్రా డైమండ్ లీగ్ ఫైనల్లో మరోసారి తన ప్రతిభను చాటుకున్నాడు. గురువారం రాత్రి జరిగిన ఈసీజన్ చివరి పోటీలో,చివరి ప్రయత్నం వరకు పోరాడి అద్భుత ప్రదర్శన కనబరిచి రజత పతకాన్ని సాధించాడు. గతసారి టైటిల్ గెలిచిన నీరజ్ ఈసారి రెండో స్థానంతో తృప్తిపడ్డాడు.జర్మనీకి చెందిన జూలియన్ వెబర్ మొదటి నుంచే ఆధిపత్యాన్ని చూపించాడు. తన మొదటి త్రోలోనే 91.37మీటర్ల దూరం విసరడం ద్వారా స్వర్ణ పతకాన్ని దాదాపుగా ఖాయం చేసుకున్నాడు. ఇది అతని కెరీర్‌లోనే అత్యుత్తమ రికార్డ్ కావడం విశేషం.మరోవైపు, నీరజ్ తన తొలి ప్రయత్నంలో 84.35మీటర్ల త్రో విసరగా,ట్రినిడాడ్ అండ్ టొబాగో క్రీడాకారుడు కేశోర్న్ వాల్కాట్ 84.95మీటర్లతో రెండో స్థానంలో నిలిచాడు.

వివరాలు 

వరుసగా 26వ సారి టాప్-2లో నిలిచి తన రికార్డును కొనసాగించిన నీరజ్ 

తదుపరి రౌండ్లలో నీరజ్ కాస్త కష్టాల్లో పడ్డాడు. మూడవ, నాల్గవ, ఐదవ ప్రయత్నాలు వరుసగా ఫౌల్స్ కావడంతో అతనిపై ఒత్తిడి పెరిగింది. అయినప్పటికీ, ఒత్తిడిని అధిగమించి చివరి ఆరవ ప్రయత్నంలో 85.01 మీటర్ల దూరం విసిరి అద్భుతమైన త్రో చేశాడు. దీంతో వాల్కాట్‌ను వెనక్కి నెట్టి రెండో స్థానాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈసారి టైటిల్ దక్కకపోయినా, నీరజ్ తన స్థిరమైన ప్రదర్శనను కొనసాగించాడు. అంతర్జాతీయ స్థాయిలో వరుసగా 26వసారి టాప్-2 స్థానాల్లో నిలిచి తన అపూర్వ ప్రతిభను మరోసారి నిరూపించుకున్నాడు. ఈ పోటీలో మాజీ ప్రపంచ ఛాంపియన్ అండర్సన్ పీటర్స్ 82.06 మీటర్ల త్రోతో నాల్గవ స్థానాన్ని పొందాడు.