Diamond League: డైమండ్ లీగ్‌లో నీరజ్ చోప్రా, అండర్సన్ పీటర్స్.. హ్యాట్రిక్ లక్ష్యంగా నీరజ్
పారిస్ ఒలింపిక్స్ రజత పతక విజేత నీరజ్ చోప్రా లాసాన్ డైమండ్ లీగ్‌లో పాల్గొనేందుకు సిద్ధమయ్యాడు. చతుర్వార్షిక ఈవెంట్ తర్వాత మొదటి డైమండ్ లీగ్‌ను గెలవాలనే ఆశతో నీరజ్ భారత కాలమానం ప్రకారం ఆగస్టు 22న అర్ధరాత్రి 12.15 గంటలకు బరిలోకి దిగునున్నాడు. నీరజ్ చోప్రా పారిస్ ఒలింపిక్స్‌లో 89.45 మీటర్లు విసిరి రజతం సాధించాడు. నీరజ్‌తో పాటు పారిస్ కాంస్య పతక విజేత అండర్సన్ పీటర్స్ కూడా లౌసానేలో పాల్గొననున్నారు. వీరిద్దరితో పాటు, అనుభవజ్ఞులు జూలియస్ యెగో, జాకుబ్ వడ్లెజ్ కూడా ఫీల్డ్‌లో ఉండబోతున్నారు. వరుసగా రెండేళ్ల (2022, 2023) నుంచి డైమండ్ లీగ్ టైటిల్‌ను నీరజ్ సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతున్నాడు.
లౌసాన్ డైమండ్ లీగ్: ఎప్పుడు,ఎక్కడ చూడాలి
నీరజ్ చోప్రా జావెలిన్ త్రో ఈవెంట్‌ను ప్రత్యక్షంగా స్పోర్ట్స్ 18, జియో సినిమాలోనూ వీక్షించొచ్చు. ఆగస్ట్ 17న నీరజ్ చోప్రా ఈ కార్యక్రమంలో తన భాగస్వామ్యాన్ని ధృవీకరించారు. 2023-24 సీజన్‌లో గజ్జెలలో గాయంతో పోరాడిన నీరజ్ తన టైటిల్‌ను కాపాడుకునే అవకాశాన్ని పొందడం ఆశ్చర్యం కలిగించింది. పాకిస్థాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ 92.97 మీటర్లు విసిరి ఒలింపిక్ రికార్డును బద్దలు కొట్టి స్వర్ణం కైవసం చేసుకున్నాడు. అర్షద్ నదీమ్ డైమండ్ లీగ్‌లో పాల్గొనడం లేదు. దీంతో మరోసారి నీరజ్‌పైనే అందరి దృష్టి ఉంది.